Amaravathi : విద్యుత్ కోతలు తట్టుకోలేక విద్యుత్ ఆఫీసునే తగలబెట్టిన యువకులు
Amaravathi : గ్రామానికి వరుసగా మూడు రోజులు కరెంటు లేకపోవడంతో గ్రామస్థుల ఆగ్రహం పెరిగింది. విద్యుత్ అధికారులు ఫోన్ లలో స్పందించకపోవడం, సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఇద్దరు యువకులు ఆగ్రహంతో రెచ్చిపోయారు
- Author : Sudheer
Date : 18-06-2025 - 12:20 IST
Published By : Hashtagu Telugu Desk
మహారాష్ట్ర అమరావతి జిల్లా వాల్గావ్ గ్రామంలో విద్యుత్ సరఫరా (Power supply) వ్యవహారం గొడవకు దారి తీసింది. గ్రామానికి వరుసగా మూడు రోజులు కరెంటు లేకపోవడంతో గ్రామస్థుల ఆగ్రహం పెరిగింది. విద్యుత్ అధికారులు ఫోన్ లలో స్పందించకపోవడం, సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఇద్దరు యువకులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. శుక్రవారం రాత్రి నుంచి కరెంటు లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రామస్థులు సోమవారం మధ్యాహ్నం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్దకు ర్యాలీగా వెళ్లారు.
CM Revanth Reddy : సీఎం రేవంత్ ను అభినందించిన బిజెపి ఎమ్మెల్యే
ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇంజనీర్‌ను యువకులు ఫోన్‌లో వీడియో తీస్తూ ప్రశ్నించగా, అతడి తీరుపై కోపం చెలరేగింది. వెంటనే వారు తీసుకువచ్చిన పెట్రోల్‌ను సబ్‌స్టేషన్‌లోని ఫర్నిచర్ మీద చల్లి నిప్పు పెట్టారు. అదేగాక ఆ ఇంజనీర్‌పై కూడా పెట్రోల్ పోసి తగలబెట్టేందుకు యత్నించారు. అయితే ఆ ఇంజనీర్ తృటిలో తప్పించుకొని ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. ఈ ఘటన కారణంగా సబ్‌స్టేషన్‌లోని కొన్ని యంత్రాలు దగ్ధమయ్యాయి. దీంతో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిచిపోయింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఘటనపై స్పందించిన పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. గ్రంహాంతర హింసా చర్యలపై అధికారులు తీవ్రంగా స్పందించారు. విద్యుత్ శాఖ అధికారులు గ్రామస్తులను హింసాత్మక మార్గాలు వదిలి సహనంతో వ్యవహరించాలని సూచించారు. విద్యుత్ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బాధిత ఇంజనీర్‌తో పాటు సబ్‌స్టేషన్‌కు జరిగిన నష్టాన్ని అంచనా వేసి, బాధ్యులపై మరింత విచారణ కొనసాగుతోంది.