Lawrence Bishnoi : జైలులో నుంచి లారెన్స్ బిష్ణోయి ఇంటర్వ్యూలు.. ఏడుగురు పోలీసులు సస్పెండ్
లారెన్స్ బిష్ణోయి(Lawrence Bishnoi) కస్టడీలో ఉన్న టైంలో టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు అనుమతించినందుకు వారిపై ఈమేరకు పంజాబ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
- By Pasha Published Date - 11:36 AM, Sat - 26 October 24

Lawrence Bishnoi : గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి జైలులో నుంచి మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చిన వ్యవహారం యావత్ దేశంలో కలకలం రేపింది. ఆ ఇంటర్వ్యూల్లో అతగాడు వీడియో కాల్‌లో మాట్లాడుతూ కనిపించాడు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసు శాఖ 2023 మార్చిలో ఒక మీడియా సంస్థకు లారెన్స్ బిష్ణోయి ఇంటర్వ్యూ ఇచ్చాడని గుర్తించింది. దీంతో పంజాబ్ పోలీసుశాఖ చర్యలకు ఉపక్రమించింది. ఇద్దరు డీఎస్పీలు సహా ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటువేసింది. లారెన్స్ బిష్ణోయి(Lawrence Bishnoi) కస్టడీలో ఉన్న టైంలో టీవీ ఛానళ్లకు రెండు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు అనుమతించినందుకు వారిపై ఈమేరకు పంజాబ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అప్పట్లో పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య జరిగిన తర్వాత లారెన్స్ బిష్ణోయిను ఈ ఇంటర్వ్యూలు చేయడం గమనార్హం. దాంతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్‌తో జైలు సిబ్బంది, పోలీసులు చేతులు కలిపారని అప్పట్లో సిద్ధూ మూసేవాలా తండ్రి ఆరోపించారు.
జైలు నుంచి లారెన్స్ బిష్ణోయి ఇంటర్వ్యూలు ఇచ్చిన వ్యవహారంపై పంజాబ్ – హర్యానా కోర్టు ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్)ను ఏర్పాటుచేసింది. లారెన్స్ బిష్ణోయ్ కొన్నేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. తన బ్యారక్‌లోకి అక్రమంగా వచ్చే సెల్‌ఫోన్ల ద్వారా అనుచరులతో అతడు టచ్‌లో ఉంటాడని చెబుతుంటారు. జైలు నుంచే హత్యల కోసం లారెన్స్ ప్లానింగ్ చేస్తుంటాడనే ప్రచారం జరుగుతోంది. బాబా సిద్ధిఖీ హత్య కూడా ఈవిధంగా జరిగిందే అని ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. గుజరాత్‌లోని సబర్మతీ జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయిని కస్టడీలోకి తీసుకోవాలని ముంబై పోలీసులు భావించారు. అయితే ఆ అవకాశం లేకుండా కేంద్ర హోంశాఖ లారెన్స్ బిష్ణోయి తరలింపుపై చట్టపరమైన ఆంక్షలు విధించింది. దీంతో అతడిని కస్టడీలోకి తీసుకొని ఇంటరాగేట్ చేసే ఛాన్స్ ముంబై పోలీసులకు దక్కలేదు.
Also Read :BluJ Aerospace : విమానం నిలువునా నింగిలోకి, నేలపైకి.. హైదరాబాద్ స్టార్టప్ తడాఖా
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు హత్య బెదిరింపులు ఇవ్వడంతో 2018 సంవత్సరంలో లారెన్స్ బిష్ణోయి ఫేమస్ అయ్యాడు. ఇటీవలే ముంబైలో అజిత్ పవార్ వర్గం ఎన్‌సీపీ నేత బాబా సిద్దిఖీ హత్యలో కూడా లారెన్స్ ముఠా పేరే వినిపిస్తోంది. బాబా సిద్దిఖీని హత్య చేసిన షూటర్లు తమకు లారెన్స్ గ్యాంగ్ నుంచే ఫండ్స్ అందాయని అంటున్నారు.