Kashmiri Driver: రూ.10లక్షల విలువైన బంగారాన్ని మర్చిపోయిన ప్యాసింజర్.. తిరిగిచ్చిన డ్రైవర్
ట్యాక్సీలో మర్చిపోయిన బంగారాన్ని తిరిగిచ్చిన డ్రైవర్
- By Anshu Published Date - 09:11 PM, Tue - 6 December 22
బంగారం అంటే మనకు ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రూపాయి రూపాయి పోగేసి కొంత బంగారాన్ని కూడగట్టాలని ఎంతోమంది ఆశపడుతూ ఉంటారు. అందుకు తగ్గట్టుగా చాలామంది కష్టపడి డబ్బులు సంపాదించి, దానితో ఎంతో కొంత బంగారాన్ని కొంటూ ఉంటారు. అంత కష్టపడి కొనుక్కున్న బంగారం పోగొట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం.
అయితే కాశ్మీర్ ను చూడటానికి అని వెళ్లిన ఓ హైదరాబాదీ పరిస్థితి ఇలా మారింది. ఏకంగా పది లక్షల విలువైన బంగారాన్ని కాశ్మీర్ టూర్ కు వెళ్లిపోగొట్టుకున్నాడు. కాశ్మీర్ అందాలను ఆస్వాదించడానికి అని వెళ్లిన సదరు టూరిస్ట్ తన దగ్గర ఉన్న బంగారాన్ని ట్యాక్సీలో మర్చిపోయాడు. కానీ అప్పుడే ఓ అద్భుతం జరిగింది.
హైదరాబాద్ నుండి ఓ వ్యక్తి కాశ్మీర్ అందాలను చూడటానికి అని వెళ్లారు. అయితే అక్కడి అందాలను బాగా ఆస్వాదించిన తర్వాత ఇక తిరిగి హైదరాబాద్ కి బయలుదేరారు. ఎయిర్ పోర్టుకు ఓ ట్యాక్సీ ఎక్కి బయలుదేరారు. ట్యాక్సీ దిగి ఎయిర్ పోర్టుకు వెళ్లిపోగా.. తన బంగారాన్ని ట్యాక్సీలో మర్చిపోయిన విషయాన్ని తర్వాత గమనించారు.
వెంటనే తాము ఎక్కడైతే ట్యాక్సీని మాట్లాడామో ఆ ట్యాక్సీ స్టాండ్ ప్రెసిడెంట్ గా ఉన్న అబ్దుల్ రషీద్ వానికి విషయం చెప్పారు. మోవేరా పల్గామ్ ట్యాక్సీ స్టాండ్ ప్రెసిడెంట్ వెంటనే ట్యాక్సీ డ్రైవర్లను అలర్ట్ చేశాడు. దాంతో టూరిస్ట్ ప్రయాణించిన ట్యాక్సీ డ్రైవర్ ఆకాశ్ ఫరూఖీ వాని.. తన ట్యాక్సీని పూర్తిగా వెతకగా సదరు టూరిస్ట్ బంగారం కనబడింది.
దీంతో వెంటనే టూరిస్ట్ కు రూ.10లక్షల విలువైన బంగారాన్ని ట్యాక్సీ డ్రైవర్ ఆకాశ్ ఫరూఖీ వాని తిరిగి ఇచ్చేశాడు. టవేరా డ్రైవర్ గా ఉన్న ఆకాశ్ ఫరూఖీ వాని.. తన బంగారాన్ని తిరిగి ఇచ్చేయడంతో ఆ టూరిస్ట్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. డ్రైవర్ చేసిన పనికి తోటి డ్రైవర్లతో పాటు అందరూ మెచ్చుకున్నారు. ఆకాశ్ ఫరూఖీ లాంటి నిజాయితీ గల డ్రైవర్లు లోకంలో ఉన్నారు కాబట్టే సమాజంలో ఇంకా మానవత్వం నిలిచి ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు.