CJI : న్యాయవ్యవస్థ చరిత్రలో సీజేఐలుగా తండ్రి, కొడుకులు.. సుప్రీం చీఫ్ జస్టిస్‌గా చంద్రచూడ్ ప్రమాణస్వీకారం
జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ పదవీ విరమణ తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం ప్రమాణ...
- By Prasad Published Date - 10:54 AM, Wed - 9 November 22

జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ పదవీ విరమణ తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ డివై చంద్రచూడ్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 9న పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్ స్థానంలో జస్టిస్ చంద్రచూడ్ నియమితులయ్యారు. భారత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డి వై చంద్రచూడ్ బుధవారం దేశ న్యాయవ్యవస్థకు 50వ అధిపతి అయ్యారు. నవంబర్ 10, 2024 వరకు ఆయన పదవీకాలం ఉంటుంది. నవంబర్ 9, 2022 నుండి అమలులోకి వచ్చేలా భారత ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ పేరును గత నెలలో కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్‌ను నియమించడం పట్ల రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. జస్టిస్ చంద్రచూడ్ తండ్రి జస్టిస్ వైవీ చంద్రచూడ్ భారతదేశానికి 16వ ప్రధాన న్యాయమూర్తిగా ఫిబ్రవరి 2, 1978 నుండి జూలై 11, 1985 వరకు పనిచేశారు. న్యాయవ్యవస్థ చరిత్రలో తండ్రి, కొడుకులు సీజేఐ కావడం ఇదే తొలిసారి.