India Attack : పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడి.. భారత్ వాడిన ఆయుధాలివే!
భారత్‌కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాల నుంచి పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపైకి స్కాల్ప్ క్షిపణులను(India Attack) ప్రయోగించారు.
- By Pasha Published Date - 12:21 PM, Wed - 7 May 25

India Attack : పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ మంగళవారం అర్ధరాత్రి భీకర దాడి చేసింది. భారత ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న నాలుగు ఉగ్రవాద స్థావరాలు, పీఓకేలోని ఐదు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు. అత్యంత కచ్చితత్వంతో ఈ ఎటాక్స్ చేశామని భారత సైన్యం ప్రకటించింది. 9 ఉగ్రవాద స్థావరాలపై 25 నిమిషాల వ్యవధిలో 24 మిస్సైల్ స్ట్రైక్‌లతో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ముగిసింది. ఈ ఆపరేషన్‌లో దాదాపు 90 మందికిపైగా ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ దాడి కోసం భారత సైన్యం వినియోగించిన ఆయుధాల గురించి మనం ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Operation Sindoor : ప్రతీకారం తీర్చుకున్నాం.. పాక్ కయ్యానికి దిగితే ఊరుకోం : భారత్
‘ఆపరేషన్ సిందూర్’లో భారత త్రివిధ దళాల సమన్వయం
పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసే క్రమంలో భారత ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, నేవీ సమన్వయం చేసుకున్నాయి. అతిపెద్ద ఉగ్ర స్థావరాలైన బవహల్పూర్, మురిద్కేలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. మిగిలిన వాటిని భారత ఆర్మీ ధ్వంసం చేసింది. ఈ దాడులు జరుగుతున్న క్రమంలో భారత నౌకాదళం తన నిఘా వ్యవస్థలైన పీ8ఐ విమానాలు, ఎంక్యూ9 డ్రోన్లతో తగిన సహకారాన్ని అందించింది. ఈవిధంగా సమగ్ర సమన్వయంతో ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించారు.
Also Read :India Attack : భారత్ ఎటాక్.. పీఓకేలో 90 మంది ఉగ్రవాదులు హతం?
స్కాల్ప్ క్షిపణులు
భారత్‌కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాల నుంచి పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపైకి స్కాల్ప్ క్షిపణులను(India Attack) ప్రయోగించారు. ఈ మిస్సైళ్లను స్ట్రామ్‌షాడో అని కూడా పిలుస్తారు. వీటిని ఫ్రాన్స్ తయారు చేసింది. ఇవి లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైళ్లు. దాదాపు 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే కెపాసిటీ వీటి సొంతం.
హ్యామర్ బాంబులు
పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత వాయుసేన హ్యామర్ బాంబులు వాడింది. ఇవి చాలా శక్తివంతమైన బాంబులు. బంకర్లను, బహుళ అంతస్తుల భవనాలను కూడా ఇవి ధ్వంసం చేయగలవు. వీటిని శత్రు లక్ష్యానికి 50-70 కిలోమీటర్ల దూరం నుంచే ప్రయోగించొచ్చు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు బహవల్‌పూర్‌లో మర్కజ్ సుబాన్ ఉగ్రవాద స్థావరం ఉంది. ఇది భారత సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. లష్కరే తైబా ఉగ్రవాద సంస్థ హెడ్‌క్వార్టర్ మర్కజ్ తైబా భారత సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. వీటిపై హ్యామర్ బాంబులు వేసినట్లు తెలుస్తోంది.
ఆత్మాహుతి డ్రోన్లు
పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు భారత ఆర్మీ ఆత్మాహుతి డ్రోన్లను వాడినట్లు సమాచారం. ఇవి నిర్దేశించిన ప్రాంతాలను చేరుకొని లక్ష్యాలను గుర్తించి, వాటిపై విరుచుకుపడతాయి. తమను తాము పేల్చుకుంటాయి. ఈవిధంగా పలు ఉగ్రవాద స్థావరాలను భారత్ ఆర్మీ పంపిన సూసైడ్ డ్రోన్లు ధ్వంసం చేశాయి. వీటి వినియోగం ద్వారా భారత సైన్యం వైపు ప్రాణనష్టాన్ని నివారించారు.