Vladimir Putin : భారత్ ఓ గొప్ప దేశం: రష్యా అధ్యక్షుడు ప్రశంసలు..
Vladimir Putin : పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడుతూ ఆర్థికవృద్ధిలో అగ్రగామిగా ఉంది. ఏడాదికి 7.4 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో పాటు ప్రాచీన సంస్కృతికి భారత్ నిలయం.
- By Latha Suma Published Date - 02:59 PM, Fri - 8 November 24

India-Russia Relations : భారత్‌పై మరోసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసలు కురిపించారు. సోచిలోని వాల్డాయ్‌లో మీడియాతో మాట్లాడిన పుతిన్ తమ దేశానికి భారత్ సహజ భాగస్వామి అని కొనియాడారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. “భారత్ ఓ గొప్ప దేశం”. ఆ దేశంతో మా సంబంధాలను అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. పెద్ద ఆర్థిక వ్యవస్థలతో పోటీ పడుతూ ఆర్థికవృద్ధిలో అగ్రగామిగా ఉంది. ఏడాదికి 7.4 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగంగా వృద్ధి చెందడంతో పాటు ప్రాచీన సంస్కృతికి భారత్ నిలయం. ప్రపంచంలోని అగ్రరాజ్యాల జాబితాలో చేర్చడానికి ఇండియాకు అర్హత ఉంది. భద్రత, రక్షణ రంగాలలో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత అభివృద్ధి చెందుతాయి. సంవత్సరానికి ఇరుదేశాల మధ్య వాణిజ్యం 60 బిలియన్ డాలర్లుగా ఉంది’ అని పుతిన్ తెలిపారు.
ఇక, భారత్- రష్యా మధ్య ఉమ్మడి సహకారానికి బ్రహ్మోస్‌ను ఉదాహరణ అని పేర్కొన్నారు. ఇది ఇరు దేశాల మధ్య విశ్వాసానికి, భవిష్యత్తులో భాగస్వామ్యానికి సాక్ష్యంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి కరెన్సీని సృష్టించే లక్ష్యాలు లేవన్నారు. ఈ సందర్భంగా భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంతో సోవియెట్ యూనియన్ పాత్రను రష్యా అధ్యక్షుడు పుతిన్ గుర్తు చేశారు. ఇకపోతే..భారత్, రష్యా మధ్య మైత్రి ఇప్పటిది కాదు. అమెరికా కంటే ముందు నుంచే రష్యా భారత్‌కు మంచి మిత్రదేశంగా కొనసాగుతూ వస్తోంది. ఆ ఆనవాయితీని ఇరుదేశాలు కొనసాగిస్తూ వస్తున్నాయి. ఇరుదేశాధినేతలు మారినా ఇరుదేశాల మైత్రివిధానంలో ఎటువంటి మార్పులు లేవు.