Ilayaraja: నరేంద్రమోదీపై కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకున్న సంగీత దర్శకుడు ఇళయరాజా
తన సంగీత సాగరంలో కోట్లాది మంది ప్రజలను ఓలలాడించిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాను వివాదం చుట్టుముట్టింది.
- Author : Hashtag U
Date : 16-04-2022 - 10:27 IST
Published By : Hashtagu Telugu Desk
తన సంగీత సాగరంలో కోట్లాది మంది ప్రజలను ఓలలాడించిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాను వివాదం చుట్టుముట్టింది. ఆయన ఈ మధ్య ఓ పుస్తకానికి ముందు మాట రాశారు. ఆ పుస్తకం పేరు.. అంబేడ్కర్ అండ్ మోడీ రీఫార్మర్స్ ఐడియాస్, పెర్ఫార్మెర్స్ ఇంప్లిమెంటేషన్. ఈ ముందుమాటలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని.. ఏకంగా అంబేద్కర్ తో పోల్చడంతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు.
మోదీ విషయంలో ఇళయరాజా తన ముందుమాటలో ఏం చెప్పారంటే.. అంబేద్కర్, మోదీల వ్యక్తిత్వాల మధ్య కొన్ని పోలికలున్నాయని వాటిని ప్రస్తావించారు. ఈ ఇద్దరు నాయకులు అసమానతలను అధిగమించారని అన్నారు. ఇద్దరూ పేదరికాన్ని అనుభవించినా దాని నుంచి బయటపడ్డారన్నారు. సామాజిక అణిచివేతను చూసినా సరే.. దానిని రూపుమాపడానికి కృషి చేశారన్నారు.
దేశాభివృద్ధి కోసం ఇద్దరూ స్వప్నాలు కన్నారని.. వాటిని అమలు చేయాలనుకున్నారని రాసుకొచ్చారు ఇళయరాజా. ట్రిపుల్ తలాక్ చట్టం రద్దు, బేటీ బచావో-బేటీ పఢావో వంటి పథకాలను అమలు చేసిన మోదీని చూసి అంబేద్కర్ కూడా గర్వపడతారని ఇళయరాజా ఆ ముందు మాటలో ఘనంగా రాయడంతో అది కాస్తా వివాదాస్పదమైంది.
సంగీతకారుడిగా ఇళయరాజాకు ఎనలేని పేరు ప్రఖ్యాతలున్నాయి. కానీ ఈ ముందుమాటను చూసి.. ఆయన అభిమానులు కూడా కలత చెందుతున్నారు. అయినా ఈ స్థాయిలో మోదీని ప్రస్తుతించడంతో వివిధ పార్టీల నాయకులు, నెటిజన్ల నుంచి తీవ్రమైన ప్రతిస్పందన వచ్చింది. ఇళయరాజా ముందుమాట రాసిన పుస్తకాన్ని బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్… అంబేద్కర్ జయంతి సందర్భంగా పబ్లిష్ చేసింది.