IADWS: భారత స్వదేశీ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ విజయవంతం!
చైనా మ్యాగజైన్ 'ఏరోస్పేస్ నాలెడ్జ్' ఎడిటర్ వాంగ్ యాన్ మాట్లాడుతూ IADWS వెహికిల్-బేస్డ్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ QRSAM, మ్యాన్-పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ VSHORADS సాంకేతికంగా కొత్తవి మాత్రమే కాకుండా ఈ తరహా లేజర్ వ్యవస్థ భారత్ సామర్థ్యంలో ఒక ముఖ్యమైన పురోగతి అని అన్నారు.
- By Gopichand Published Date - 05:00 PM, Tue - 26 August 25

IADWS: భారతదేశ స్వదేశీ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్ (IADWS) విజయవంతమైన పరీక్షతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. యుద్ధానికి సిద్ధంగా ఉన్న సొంత రక్షణ వ్యవస్థను కలిగిన కొన్ని దేశాల జాబితాలో భారతదేశం కూడా చేరింది. ఈ డిఫెన్స్ సిస్టమ్ సామర్థ్యాన్ని చూసి చైనా నిపుణులు ఆశ్చర్యపోయారు. దీనిని భారత్‌కు ఒక గొప్ప విజయంగా వారు పేర్కొన్నారు.
శనివారం (ఆగస్టు 23) నాడు ఒడిశా తీరంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఒకేసారి అనేక లక్ష్యాలను ఛేదించగలదు. ఈ పరీక్ష అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ టెస్ట్ భారత్ బహుళ-పొరల గాలి రక్షణ వ్యవస్థను స్థాపించిందని, ఇది శత్రువుల వైమానిక దాడుల నుండి దేశంలోని ముఖ్యమైన సదుపాయాలను రక్షించడంలో సహాయపడుతుందని అన్నారు.
IADWS అంటే ఏమిటి?
IADWS అనేది బహుళ-పొరల రక్షణ వ్యవస్థ. ఇది క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్స్ (QRSAM), వెరీ షార్ట్-రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS), లేజర్-బేస్డ్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (DEW)లను ఒకేసారి మోసుకెళ్లగలదు. దీనిని ఒకే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి నియంత్రిస్తారు.
Also Read: Boiled Egg : వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడేవారు కోడిగుడ్డు తినొచ్చా? వైద్యుల ఏం సలహా ఇచ్చారంటే?
శనివారం జరిగిన పరీక్షలో IADWS ఒకేసారి మూడు లక్ష్యాలను ఛేదించింది. ఈ లక్ష్యాలలో రెండు హై-స్పీడ్ మానవరహిత ఏరియల్ వాహనాలు, ఒక మల్టీ హెలికాప్టర్ డ్రోన్ ఉన్నాయి. IADWSలోని మిస్సైల్స్, డ్రోన్ డిటెక్షన్, వెపన్ సిస్టమ్ కమాండ్, కంట్రోల్, రాడార్ వంటి అన్ని భాగాలు అద్భుతంగా పనిచేశాయని ఒక అధికారి తెలిపారు.
చైనా డిఫెన్స్ సిస్టమ్: LW-30
భారత డిఫెన్స్ సిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా చైనా, పాకిస్తాన్‌లో కలకలం సృష్టించింది. యుద్ధానికి సిద్ధంగా ఉన్న లేజర్ డిఫెన్స్ సిస్టమ్ కలిగిన దేశాలలో భారత్‌తో పాటు అమెరికా, రష్యా, చైనా, యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, ఇజ్రాయెల్ ఉన్నాయి. చైనా దగ్గర LW-30 లేజర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది.
చైనా నిపుణుల ప్రశంసలు
గ్లోబల్ టైమ్స్ పత్రిక నివేదిక ప్రకారం.. చైనా మ్యాగజైన్ ‘ఏరోస్పేస్ నాలెడ్జ్’ ఎడిటర్ వాంగ్ యాన్ మాట్లాడుతూ IADWS వెహికిల్-బేస్డ్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ QRSAM, మ్యాన్-పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ VSHORADS సాంకేతికంగా కొత్తవి మాత్రమే కాకుండా ఈ తరహా లేజర్ వ్యవస్థ భారత్ సామర్థ్యంలో ఒక ముఖ్యమైన పురోగతి అని అన్నారు.
పాకిస్తాన్‌కు పెరిగిన ఆందోళన
భారత్ ఈ పరీక్ష పాకిస్తాన్‌కు మరింత ఆందోళన కలిగించింది. ఒకవైపు భారత్ స్వంతంగా అధునాతన మిస్సైల్స్, డిఫెన్స్ సిస్టమ్‌లను అభివృద్ధి చేస్తుంటే మరోవైపు పాకిస్తాన్ వద్ద ఉన్న ఆయుధాలలో 81 శాతం చైనాకు చెందినవే. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) నివేదిక ప్రకారం.. పాకిస్తాన్‌కు 81 శాతం సైనిక పరికరాలను చైనా సరఫరా చేస్తుంది. ఇప్పుడు చైనా నిపుణుల ప్రశంసలు పాకిస్తాన్ ఆందోళనను మరింత పెంచుతాయి.
IADWS పరీక్షను భారత్ సరైన సమయంలో నిర్వహించింది. ఎందుకంటే పాకిస్తాన్‌తో సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్‌లో భారత వైమానిక రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్‌లను గుర్తించి ధ్వంసం చేసింది. దీనితో పాకిస్తాన్ ఇప్పటికే భయపడి ఉంది. ఇప్పుడు ఈ కొత్త పరీక్షతో పాకిస్తాన్ ఆందోళన మరింత పెరిగింది.