Omar Abdullah : పర్యాటకులను కాపాడటంలో విఫలం అయ్యాను: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి
ఇలాంటి దాడులు గతంలో చాలా చూశాం. కానీ, బైసరన్‌లో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం 21 ఏళ్లలో ఇదే తొలిసారి. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే. నేను ఆ పనిచేయలేకపోయాను. క్షమాపణలు చెప్పేందుకు నా వద్ద మాటలు కరవయ్యాయి. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో కూడా తెలియడం లేదన్నారు.
- By Latha Suma Published Date - 07:27 PM, Mon - 28 April 25

Omar Abdullah : పహల్గాం దాడిపై చర్చించేందుకు జమ్మూకశ్మీర్ అసెంబ్లీ నేడు అత్యవసరంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ..అతిథులను కాపాడటంలో తానూ విఫలమయ్యానని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇలాంటి దాడులు గతంలో చాలా చూశాం. కానీ, బైసరన్‌లో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం 21 ఏళ్లలో ఇదే తొలిసారి. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే. నేను ఆ పనిచేయలేకపోయాను. క్షమాపణలు చెప్పేందుకు నా వద్ద మాటలు కరవయ్యాయి. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో కూడా తెలియడం లేదన్నారు.
Read Also: Tahawwur Rana : తహవ్వుర్ రాణా ఎన్‌ఐఏ కస్టడీ పొడిగింపు
26 మంది ప్రాణాలను అడ్డం పెట్టుకొని తాను రాష్ట్రహోదాను డిమాండ్ చేయబోనని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని జాతి తీవ్ర వేదనల్లో ఉన్నప్పుడు కాకుండా.. మరేదైనా రోజు లేవనెత్తుతానని చెప్పారు. పహల్గాం ఘటన తర్వాత ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రహోదాను డిమాండ్ చేయాలి. నా రాజకీయాలు అంత చౌకబారువి కాదు. గతంలో రాష్ట్ర హోదా అడిగాము.. భవిష్యత్తులో కూడా అడుగుతాము. కానీ, 26 మంది చనిపోయారు. ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వండి అని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటు అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి, పర్యాటకశాఖ మంత్రిగా వారిని కాపాడలేకపోయానన్నారు. ప్రజలు మాకు మద్దతు ఇస్తే.. మిలిటెన్సీ, ఉగ్రవాదం అంతమవుతాయి. ఇది దానికి ఆరంభం. ఈ ఉద్యమానికి హాని కలిగించేది ఏదీ మాట్లాడకూడదు, చేయకూడదు. మేము మిలిటెన్సీని తుపాకులతో అదుపు చేయగలం.. కానీ, మాకు ప్రజల మద్దతు అవసరం అని అబ్దుల్లా అసెంబ్లీలో పేర్కొన్నారు. మరోవైపు, ప్రతిపక్ష నాయకుడు సునీల్ శర్మ ఉగ్రవాద దాడిని ఖండించారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని మరియు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రిని ప్రశంసించారు.
కాగా, ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపి 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. వారిలో 25 మంది భారతీయులు, ఒకరు నేపాల్ జాతీయుడు ఉన్నారు.