Pahalgam Incident : పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు నిర్వహించండి..ప్రధానికి రాహుల్ లేఖ
"పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. ఈ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం కలిసి ఉంటామని అందరికీ తెలియజేయాలి. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేయాలని ప్రతిపక్షాలు విశ్వసిస్తున్నాయి" అని రాహుల్ పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 11:57 AM, Tue - 29 April 25

Pahalgam Incident : జమ్ముకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో పాకిస్థాన్ వైఖరిని అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా ఖండిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాని మోడీకి మంగళవారం లేఖ రాశారు. “పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. ఈ క్లిష్ట సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం కలిసి ఉంటామని అందరికీ తెలియజేయాలి. పార్లమెంటు ఉభయ సభల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేయాలని ప్రతిపక్షాలు విశ్వసిస్తున్నాయి” అని రాహుల్ పేర్కొన్నారు.
ఇక, ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఖర్గే సైతం ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఏప్రిల్ 22న పహల్గాం ఘటన లో అమాయక పౌరులపై జరిగిన క్రూరమైన ఉగ్రవాద దాడి జరిగింది. ఈ తరుణంలో ఐక్యత, సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది. అందుకే పార్లమెంట్ ఉభయ సభలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయించండి. తద్వారా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే మన సమిష్టి సంకల్పానికి ఇది శక్తివంతమైన ప్రదర్శన అవుతుంది అని ఖర్గే తన లేఖలో ప్రస్తావించారు.
Read Also: Rohit Basfore : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నటుడు అనుమానాస్పద మృతి
కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశాయి. ఈ క్రమంలోనే పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని విపక్షాల నుంచి డిమాండ్‌లు వ్యక్తమవుతున్నాయి. పహల్గాం దాడిని ఖండిస్తూ తీర్మానం చేయడం ద్వారా దేశం మొత్తం ఐక్యంగా ఉందనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ సూచించారు. ఈవిషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలంటూ రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.
కాగా, జనవరి 31 నుంచి ఏప్రిల్ 4వ తేదీల మధ్య రెండు దఫాలుగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఇక తరువాత జులైలో వర్షాకాల సమావేశాలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో ప్రతిపక్ష విజ్ఞప్తికి కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. పహల్గాం దాడి తర్వాత జరిగిన అఖిలపక్ష సమావేశంలో.. విపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతుగా నిలుస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.