Gujarat CM: ప్రజల కోసం సీఎం సంచలన నిర్ణయం.. పెళ్లి కోసం బహిరంగ సభ వేదిక మార్పు!
జామ్‌నగర్‌లోని సంజనా పర్మార్ వివాహం కోసం ఆమె కుటుంబ సభ్యులు నవంబర్ 23న జరగబోయే వేడుకల నిమిత్తం సిటీ టౌన్ హాల్‌ను ముందుగానే బుక్ చేసుకున్నారు.
- By Gopichand Published Date - 07:57 PM, Sun - 23 November 25
Gujarat CM: ప్రజా సమస్యల పట్ల గుజరాత్ ముఖ్యమంత్రి (Gujarat CM) భూపేంద్ర పటేల్ ఎంత సున్నితంగా స్పందిస్తారో చెప్పడానికి తాజా ఉదంతం నిదర్శనంగా నిలిచింది. ఓ సామాన్య కుటుంబానికి చెందిన వివాహ వేడుకకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి తన బహిరంగ కార్యక్రమ వేదికను తక్షణమే మార్చాలని నిర్ణయించడం రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
పెళ్లింట ఆందోళన
జామ్‌నగర్‌లోని సంజనా పర్మార్ వివాహం కోసం ఆమె కుటుంబ సభ్యులు నవంబర్ 23న జరగబోయే వేడుకల నిమిత్తం సిటీ టౌన్ హాల్‌ను ముందుగానే బుక్ చేసుకున్నారు. పెళ్లి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్న సమయంలోనే నవంబర్ 24న ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆ నగరానికి వచ్చి అదే టౌన్ హాల్‌లో ఒక ముఖ్యమైన బహిరంగ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని వారికి తెలిసింది.
సాధారణంగా ముఖ్యమంత్రి పర్యటన అంటే భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రాంతంలో భారీగా పోలీసుల మోహరింపు, రోడ్లపై ఆంక్షలు, ప్రజల రాకపోకలపై పరిమితులు విధిస్తారు. దీని కారణంగా తమ కుటుంబ వేడుకలు అస్తవ్యస్తంగా మారతాయని, ముఖ్యంగా పెళ్లికి వచ్చే అతిథులు ఇబ్బందులు పడతారని పర్మార్ కుటుంబం తీవ్ర ఆందోళన చెందింది.
Also Read: KL Rahul: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్.. టీమిండియా జట్టు ఇదే, కొత్త కెప్టెన్ ప్రకటన!
సీఎం కార్యాలయం తక్షణ స్పందన
కుటుంబ సభ్యులు తమ సమస్యను ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ముఖ్యమంత్రి పటేల్ వెంటనే స్పందించి, వారి ఆందోళనను అర్థం చేసుకున్నారు. “ఆ కుటుంబం ఆందోళనను మనం మన సొంత సమస్యగా భావించాలి” అని వ్యాఖ్యానించిన సీఎం, తన కార్యక్రమాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మరొక వేదికకు మార్చాలని తన అధికారులను ఆదేశించారు.
వధువు మామ అయిన బ్రిజేష్ పర్మార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.., “ముఖ్యమంత్రి గారు స్వయంగా మాకు ఫోన్ చేసి ‘అస్సలు ఆందోళన చెందకండి. మీరు ప్లాన్ చేసుకున్నట్లే టౌన్ హాల్‌లో పెళ్లిని కొనసాగించండి. మేము మా వేదికను మారుస్తాము’ అని భరోసా ఇచ్చారు. పెళ్లిళ్ల సీజన్ పీక్‌లో ఉన్నప్పుడు కొత్త వేదికను వెతకడం అసాధ్యం అయ్యేది. ఆయన జోక్యంతో మాపై ఉన్న పెద్ద భారం తొలగిపోయింది. ఆయన ఫోన్ చేసిన తర్వాతే మేము ప్రశాంతంగా నిద్రపోగలిగాము” అని కృతజ్ఞతలు తెలిపారు.