Gulam Nabi Azad : రాహుల్ పై విమర్శలు… మోదీపై ప్రశంసలు
కాంగ్రెస్ వర్సెస్ గులాం నబీ ఆజాద్ ఫైట్ ఆసక్తికరంగా మారింది. మరోసారి రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు ఆజాద్.
- By hashtagu Published Date - 01:54 AM, Tue - 30 August 22

కాంగ్రెస్ వర్సెస్ గులాం నబీ ఆజాద్ ఫైట్ ఆసక్తికరంగా మారింది. మరోసారి రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు ఆజాద్. ఆయన రాజకీయాలకు పనికిరానని తేల్చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష స్థానంలో ఎవరు కూర్చున్నా.. రాహుల్ బానిసగా ఫైళ్లు మోయాల్సిందే అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.. గాంధీ కుటుంబంపై మరోసారి విరుచుకుపడ్డారు.
బలవంతంగా తనను పార్టీ నుంచి బయటకు పంపారని దుయ్యబట్టారు. హస్తం నాయకత్వానికి లోపాలను సరిదిద్దుకునే సమయం లేదని.. ఎందుకూ పనికిరాని వాళ్లే ప్రస్తుతం పార్టీలో ఉన్నారని ఆక్షేపించారు ఆజాద్. ఏక్షణమైనా కాంగ్రెస్ కుప్పకూలడం ఖాయమన్నారు.
ప్రధాని మోదీతో చేతులు కలిపారన్న విమర్శలను కొట్టిపారేశారు ఆజాద్. అది కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారం మాత్రమే అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు గులాం నబీ.ఆజాద్ విమర్శలపై కాంగ్రెస్ స్పందించింది. పార్టీని నిందించి తన విలువను ఆయన మరింత తగ్గించుకుంటున్నారని విమర్శించింది. ప్రతి నిమిషం చేసిన ద్రోహాన్ని సమర్థించుకునేంతగా ఆజాద్ ఎందుకు భయపడుతున్నారు..? అంటూ ట్వీట్ చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్. ఐదు దశాబ్దాల అనుబంధానికి ముగింపు పలుకుతూ.. ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు గులాం నబీ ఆజాద్. జమ్మూకశ్మీర్‌లో కొత్త పార్టీ పెట్టేందుకు కసరత్తులు చేస్తున్నారు.