Indian Army : ఆగిన కాల్పులు.. 19 రోజుల తర్వాత ఎల్‌ఓసీ వద్ద ప్రశాంతత
ఒకవేళ కాల్పులు జరిపితే.. భారత్ భీకర దాడులకు దిగే ముప్పు ఉందనే విషయాన్ని పాక్(Indian Army) గ్రహించింది.
- Author : Pasha
Date : 12-05-2025 - 9:15 IST
Published By : Hashtagu Telugu Desk
Indian Army : ఏప్రిల్ 22 తర్వాత తొలిసారిగా ఆదివారం రాత్రి భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద ప్రశాంత వాతావరణం నెలకొంది. పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి కాల్పులు కానీ, షెల్లింగ్ కానీ జరగలేదు. 19 రోజుల తర్వాత ఆదివారం రాత్రి ప్రశాంతంగా గడిచిందని భారత ఆర్మీ ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దుల్లో కాల్పుల మోత వినిపించలేదని వెల్లడించింది. అంతర్జాతీయ సరిహద్దు, ఇతర ప్రాంతాల వెంట రాత్రి ప్రశాంతంగా గడిచిందని పేర్కొంది. పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపితే.. ఫిరంగి షెల్స్‌తో బలమైన సమాధానం ఇవ్వాలని భారత సైన్యాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదేశించారు. చిన్న కవ్వింపునకు కూడా బలమైన సమాధానం ఇవ్వాలని నిర్దేశించారు. సరిహద్దు ప్రాంతాల్లోని ఆర్మీ కమాండర్లకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఇవన్నీ తెలుసుకున్న పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపేందుకు సాహసించలేదు. ఒకవేళ కాల్పులు జరిపితే.. భారత్ భీకర దాడులకు దిగే ముప్పు ఉందనే విషయాన్ని పాక్(Indian Army) గ్రహించింది. ఇదే పరిస్థితిని పాక్ కొనసాగిస్తే బెటర్. లేదంటే భారత సైన్యం తడాఖా చూపించే అవకాశం లభిస్తుంది.
Also Read :Tibet Earthquake : టిబెట్‌లో భారీ భూకంపం.. భయంతో జనం పరుగులు
పాకిస్తాన్ ఆర్మీ గుండెల్లో రైళ్లు
‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’ తర్వాత మే 10న సాయంత్రం భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దీన్ని ఒకవేళ పాకిస్తాన్ పాటించకుంటే.. తీవ్రంగా ప్రతిఘటిస్తామని ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన ఏప్రిల్ 22వ తేదీ తర్వాతి నుంచి సరిహద్దుల్లో పాకిస్తాన్ భీకర కాల్పులు జరిపింది. దీంతో భారత ఆర్మీ కూడా బలంగా ప్రతిఘటించింది. సరిహద్దు గ్రామాలు లక్ష్యంగా పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో దాదాపు 15 మందికిపైగా సామాన్య భారత ప్రజలు చనిపోయారు. వీరిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఇకపై ఇలాంటి ఆగడాలను చూస్తూ ఊరుకునేది లేదని ప్రధాని మోడీ తేల్చి చెప్పారు. దీంతో పాకిస్తాన్ ఆర్మీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.