Farmers Vs Govt : రైతులతో కేంద్రం చర్చలు విఫలం.. 21 ఢిల్లీలోకి ప్రవేశిస్తామన్న రైతు సంఘాలు
Farmers Vs Govt : ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకొని పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు కొంటామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాల నేతలు తిరస్కరించారు.
- By Pasha Published Date - 07:49 AM, Tue - 20 February 24

Farmers Vs Govt : ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకొని పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు కొంటామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. అది తమకు సమ్మతం కాదని స్పష్టం చేశారు. ఆదివారం అర్ధరాత్రి రైతు సంఘాల నేతలు, కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ మధ్య చర్చలు జరిగాయి. ఆ సందర్భంగా కేంద్ర సర్కారు చేసిన ప్రపోజల్స్‌పై సోమవారం సాయంత్రం చర్చించిన రైతు సంఘాల నేతలు వాటికి నో చెప్పారు. కేవలం మూడు పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని కేంద్రం చెప్పడాన్ని రైతులు తప్పుపట్టారు. కేంద్రం ప్రతిపాదనలు రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా లేవని చెప్పారు. రైతు సంఘాల నేతలందరి మధ్య చర్చలు జరిగిన తర్వాతే కేంద్ర సర్కారు ప్రతిపాదనను తిరస్కరించాలని నిర్ణయించినట్లు రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ మీడియాకు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
కేంద్ర సర్కారుతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 21న ఉదయం 11 గంటలకు ఢిల్లీలోకి ప్రవేశించి శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తామని రైతు నేత శర్వాన్ సింగ్ పంథేర్ వెల్లడించారు. ‘‘కేంద్ర సర్కారు వీలైతే మా డిమాండ్లను నెరవేర్చాలి. లేదంటే ఢిల్లీకి వెళ్లేందుకు వీలుగా బారికేడ్లను తొలగించాలి’’ అని ఆయన కోరారు. ఈ నెల 23న ఢిల్లీకి మార్చ్ నిర్వహిస్తామని నోయిడా, గ్రేటర్ నొయిడా రైతులు వెల్లడించారు. భూసేకరణకు అధిక పరిహారం, అభివృద్ధి చేసిన ప్లాట్ల అప్పగింత కోరుతూ ఈ మార్చ్(Farmers Vs Govt) నిర్వహించనున్నామని తెలిపారు.
Also Read : Summer: ఒక్కసారిగా వేడెక్కిన వాతావరణం.. ఎండలతో జనాల ఇబ్బందులు
పంటలకు కనీస మద్దతు ధర, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు కోరుతూ గత వారం రైతు సంఘాలు ఢిల్లీ చలోకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో ట్రాక్టర్లు, ట్రాలీలతో ర్యాలీగా బయలుదేరిన రైతులను శంభు సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ వైపు వెళ్లకుండా బారికేడ్లు, ఇనుప కంచెలు, కాంక్రీట్ దిమ్మెలను ఏర్పాటు చేశారు. దీంతో కేంద్రం తమ డిమాండ్లను అంగీకరించాలని, లేదంటే శాంతియుతంగా ర్యాలీ చేపట్టేందుకు అనుమతించాలని కోరుతూ రైతులు వారం రోజులుగా సరిహద్దుల్లోనే ఉంటున్నారు.