India-Pak : పాక్ నుంచి వచ్చే అన్ని రకాల మెయిల్స్, పార్సిళ్ల ఎక్స్ఛేంజీ నిలిపివేత :కేంద్ర ప్రకటన
పాకిస్థాన్ నుంచి వాయు, ఉపరితల మార్గాల ద్వారా భారత్‌కు వచ్చే అన్ని రకాల మెయిల్స్, పార్సిళ్ల ఎక్స్ఛేంజీ నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వచ్చినట్లు సంబంధిత శాఖలు స్పష్టం చేశాయి.
- By Latha Suma Published Date - 05:08 PM, Sat - 3 May 25

India-Pak : పెహల్‌గామ్ ఉగ్రదాడితో పాకిస్థాన్‌తో ఉన్న అన్ని సంబంధాలను భారత్ తెంచుకుంటోంది. ఆ దేశం నుంచి భారత్‌కు వచ్చే అన్ని ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధించిన అనంతరం భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ నుంచి వాయు, ఉపరితల మార్గాల ద్వారా భారత్‌కు వచ్చే అన్ని రకాల మెయిల్స్, పార్సిళ్ల ఎక్స్ఛేంజీ నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వచ్చినట్లు సంబంధిత శాఖలు స్పష్టం చేశాయి.
Read Also: Indus Water Treaty : సింధూ జలాలను మళ్లించేందుకు భారత్ ఏ నిర్మాణం చేపట్టినా ధ్వంసం చేస్తాం: పాక్ మంత్రి
ఇక, పాకిస్థాన్‌తో సముద్ర రవాణా మార్గాలను భారత్ మూసివేసింది. ఆ దేశ జెండాతో ఉన్న ఓడలు భారత పోర్టుల్లోకి రాకుండా కేంద్రం నిషేధం విధించింది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అటు భారత ఓడలు కూడా పాక్ పోర్టుల్లోకి వెళ్లకూడదని స్పష్టం చేసింది. అంతే కాకుండా పాకిస్థాన్‌కు ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్ వస్తువుల ఎగుమతిని పరిమితం చేయాలని భారత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాటిపై ఆంక్షలు విధించే దిశగా యోచన చేస్తున్నట్లు సమాచారం.
పహల్గాం ఉగ్రదాడిలో భారత సైనికులు చనిపోవడంపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై కేంద్రం తీవ్రంగా స్పందిస్తూ పాకిస్థాన్‌కు అన్ని రంగాల్లో ఒత్తిడి తెచ్చేలా చర్యలు ప్రారంభించింది. ఇప్పటివరకు పాక్ నుంచి ప్రత్యేకంగా విమాన మార్గం, ఉపరితల మార్గాల ద్వారా వస్తున్న మెయిల్స్, పార్సిళ్లు ఇకపై భారత్ కు రాకుండా కేంద్ర టపా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాక్ పోస్టల్ సర్వీసెస్ ద్వారా పంపబడే ద్రవ్య, వస్తు సంబంధిత లావాదేవీలు పూర్తిగా నిలిచిపోతాయి. ఇది వ్యాపార సంబంధాలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.
దీంతో పాటు, దౌత్య సంబంధాల విషయంలోనూ కేంద్రం పునరాలోచన చేస్తోంది. పాక్‌తో ఉన్న MFN (Most Favoured Nation) హోదాను ఇప్పటికే భారత ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజా చర్యలన్నీ పాక్‌పై ఒత్తిడి పెంచేందుకు మరియు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ చర్యల వల్ల పాకిస్థాన్‌లోని పలు వ్యాపార సంస్థలు తీవ్రంగా నష్టపోవచ్చు. ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసేందుకు భారత్ చేపడుతున్న ఈ సమగ్ర వ్యూహం పాక్షికంగా దౌత్య విధానాలను మార్చే దిశగా ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా చర్యలు చేపట్టే అవకాశం ఉందా అనేది ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
Read Also: India Vs Pakistan : ‘అబ్దాలి’ని పరీక్షించిన పాక్.. సముద్ర జలాల్లో భారత్ ‘త్రిశూల శక్తి’