EVMs Hacking : ఈవీఎంలను హ్యాక్ చేయగలనన్న వ్యక్తిపై కేసు.. అతడు ఎక్కడ ఉన్నాడంటే ?
అయితే ఈవీఎంలను(EVMs Hacking) హ్యాక్ చేయగలనని బుకాయిస్తున్న ఆ వ్యక్తి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు.
- By Pasha Published Date - 04:20 PM, Sun - 1 December 24
EVMs Hacking : ‘‘నేను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లను హ్యాక్ చేయగలను’’ అంటూ చెప్పుకుంటున్న సయ్యద్ షుజా అనే వ్యక్తిపై మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ‘‘నేను ఈవీఎంలను హ్యాక్ చేయడంతో పాటు ట్యాంపరింగ్ చేయగలను. ఈవీఎం మెషీన్ ఫ్రీక్వెన్సీలను వేరుచేయడం ద్వారా వాటిని ట్యాంపరింగ్ చేయొచ్చు’’ అంటూ అతగాడు చేస్తున్న వ్యాఖ్యలతో కూడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఆధారంగా చూపుతూ సదరు వ్యక్తిపై మహారాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) ముంబై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నవంబర్ 30న కేసు నమోదైంది.
Also Read :Vivek Ramaswamy: పాకిస్తాన్ హోటల్‌కు రూ.1,860 కోట్లు ఇస్తారా ? .. బైడెన్ సర్కారుపై వివేక్ ఫైర్
అసలు విషయం ఏమిటంటే.. సదరు వ్యక్తిపై 2019లోనూ ఢిల్లీలో కేసు నమోదైంది. అప్పట్లో కూడా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే కేసును నమోదు చేశారు. అయితే ఈవీఎంలను(EVMs Hacking) హ్యాక్ చేయగలనని బుకాయిస్తున్న ఆ వ్యక్తి ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. ఈవిషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికార వర్గాలు తెలిపాయి. ఇక ఈవీఎంల పనితీరుపై కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఈవీఎం అనేది స్వతంత్ర వ్యవస్థ కలిగిన మెషీన్. దాన్ని వైఫై లేదా బ్లూటూత్ వంటి వాటితో లింక్ చేయలేం. దాన్ని ట్యాంపరింగ్ చేయడం అసాధ్యం. ఈవీఎంల హ్యాకింగ్ సాధ్యమేనంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవికత లేదు. అవన్నీ తప్పుడు వాదనలు’’ అని ఈసీ వెల్లడించింది.
Also Read :Tritiya Jewellers : హీరోయిన్స్‌కే కుచ్చుటోపీ పెట్టిన మోసగాడు.. కటాకటాల వెనక్కి కాంతిదత్
ఇటీవలే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని శివసేన (ఉద్ధవ్) పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సార్లు ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని ఆరోపించింది. ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్ పద్దతిని వినియోగంలోకి తేవాలని దాఖలైన పిటిషన్లపై ఇటీవలే సుప్రీంకోర్టు విచారణ జరుపుతూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్లను కొట్టివేసింది.