Operation Sindoor : భారత వ్యతిరేక తప్పుడు ప్రచారాన్ని ఉపేక్షించొద్దు.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు కీలక సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో దేశ భద్రతపై తప్పుడు వార్తలు, అపోహలు సృష్టించే ఖాతాలపై సీరియస్‌గా స్పందించాలని స్పష్టం చేసింది.
- By Latha Suma Published Date - 12:57 PM, Thu - 8 May 25

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో, దేశ వ్యతిరేక సోషల్ మీడియా ప్రచారాలపై గట్టి నిఘా పెట్టాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో సుమారు 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పహల్గాం దాడికి భారత్ ఇచ్చిన ఇది బలమైన ప్రతీకారం. ఈ దాడుల అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు కీలక సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో దేశ భద్రతపై తప్పుడు వార్తలు, అపోహలు సృష్టించే ఖాతాలపై సీరియస్‌గా స్పందించాలని స్పష్టం చేసింది.
Read Also: Gold Prices Today: రూ. లక్షకు చేరువలో బంగారం.. వెండి ధర ఎంతంటే?
దేశవ్యతిరేక ప్రచారాలు దేశంలోని వ్యక్తులు లేదా విదేశాల నుంచి వచ్చినా సరే, సంబంధిత సోషల్ మీడియా ఖాతాలను వెంటనే గుర్తించి బ్లాక్ చేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. అదేవిధంగా, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా సంస్థలు, స్థానిక ప్రభుత్వ యంత్రాంగం మధ్య సమాచార బంధాన్ని బలోపేతం చేయాలని సూచించబడింది. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్తాన్ కొన్ని వేదికల ద్వారా తప్పుడు కథనాలు, వక్రీకరణల ద్వారా భారత్‌ను నిందించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ, సోషల్ మీడియా వేదికలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను అరికట్టేందుకు యాక్టివ్‌గా వ్యవహరించాలని ఆదేశించింది. ఇటువంటి ప్రచారాల వల్ల ప్రజల్లో భయాందోళనలు పుట్టే అవకాశం ఉండడంతో, ప్రజలతో సమర్థవంతమైన కమ్యూనికేషన్ మెరుగుపర్చాలని హోంశాఖ స్పష్టం చేసింది. జాతీయ భద్రత కోసం అన్ని స్థాయిలలో సమన్వయం అవసరం అని ఈ సందర్భంగా కేంద్రం పునరుద్ఘాటించింది.
Read Also: Ajit Doval : ప్రధాని మోడీతో అజిత్ ధోవల్ భేటీ..సరిహద్దుల్లో పరిస్థితులపై వివరణ..!