Republic India: రిపబ్లిక్ తన సొంత పిల్లలను చంపుకుంటుందా ?
''భారత రిపబ్లిక్ తన సొంత పిల్లలను చంపుకోవడాన్ని మేము అనుమతించలేము'' అని న్యాయమూర్తులు అఫ్తాబ్ ఆలం,ఆర్ఎమ్ లోధాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. సిపిఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ సీనియర్ సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్,జర్నలిస్టు హేమచంద్ర పాండే 2010 జూలై 1-2 తేదీల మధ్య రాత్రి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో మరణించారు.
- By SK Zakeer Published Date - 03:28 PM, Mon - 19 May 25

”భారత రిపబ్లిక్ తన సొంత పిల్లలను చంపుకోవడాన్ని మేము అనుమతించలేము” అని న్యాయమూర్తులు అఫ్తాబ్ ఆలం,ఆర్ఎమ్ లోధాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. సిపిఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ సీనియర్ సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్,జర్నలిస్టు హేమచంద్ర పాండే 2010 జూలై 1-2 తేదీల మధ్య రాత్రి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో మరణించారు.ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ కోరుతూ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్,పాండే భార్య బబిత దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్రానికి,నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.నోటీసులకు కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆరు వారాల్లోగా సమాధానాలు ఇవ్వాలని కోరింది.”సమాధానం వస్తుందని మేము ఆశిస్తున్నాము. నమ్మదగిన సమాధానం లభిస్తుంది” అని కూడా ధర్మాసనం పేర్కొంది.”ప్రభుత్వం చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది” అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.ఆజాద్,పాండేల పోస్ట్‌మార్టం నివేదికలు, హక్కుల సంఘాలు నిర్వహించిన నిజనిర్ధారణ ఎన్‌కౌంటర్ నిజమైనది కాదని స్పష్టంగా సూచిస్తున్నాయని పిటిషన్ లో ఆరోపించారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ప్రకారం వారి హక్కులను ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇద్దరినీ చంపేశారని కోఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్స్ నిజనిర్ధారణను పిటిషనర్లు ప్రస్తావించారు.ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామీ అగ్నివేశ్ చొరవతో కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖతో చర్చల ప్రక్రియకు సన్నాహాలు ప్రాంరంభమయ్యాయి.అందులో భాగంగానే మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ అధికార ప్రతినిథి,ఉన్నత విద్యావంతుడు చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్ రహస్య జీవితం నుంచి వెలుపలికి వస్తుండగా నాగ్ పూర్ లో పట్టుకొని కాల్చి చంపి,ఆదిలాబాద్ అడవుల్లో మృతదేహాన్ని పడవేశారు.ఈ ఘటనపై అప్పట్లో స్వామి అగ్నివేశ్ తీవ్రంగా కలత చెందారు. రాజ్ కుమార్ వంటి అగ్రనేతలను బయటకు రప్పించి నిర్మూలించేందుకు నాటి కేంద్ర హోమ్ మంత్రి చిదంబరం ప్రయత్నించినట్టు ఆరోపణలూ వచ్చాయి.నిజానికి 2005 లో వైఎస్ రాజశేఖరరెడ్డితో పీపుల్స్ వార్,జనశక్తి పార్టీల ప్రతినిథులు చర్చలకు వచ్చినప్పుడు,నల్లమల అడవుల్లో ఉంది ఆ చర్చలకు మార్గదర్శకత్వం నెరపింది రాజ్ కుమార్.
సీన్ కట్ చేస్తే సరిగ్గా పదిహేనేండ్ల తర్వాత 31 మంది మావోయిస్టులను ‘చంపిన’ తర్వాత కర్రెగుట్టలపై త్రివర్ణపతాకాన్ని ప్రభుత్వ పారా మిలిటరీ బలగాలు ఎగరవేసి ‘పరాయి దేశం’పై దండయాత్రలో విజయం సాధించినట్లుగా ప్రకటనలు చేశాయి.”మావోయిస్టులపై అతిపెద్ద ఆపరేషన్ తర్వాత, ‘రెడ్ టెర్రర్’ హిల్‌లో త్రివర్ణ పతాకం ఎగురవేసాం” అని అమిత్ షా ప్రకటించారు.”ఈ ఆపరేషన్ లో 450 IEDలు, 40 ఆయుధాలు, సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.ఇది చారిత్రాత్మకమైనది.మార్చి 2026 నాటికి మావోయిజాన్ని నిర్మూలించాలన్నది ప్రభుత్వ లక్ష్యం” అని కూడా ఆయన చెప్పారు.తెలంగాణ,ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని కర్రేగుట్టల ప్రాంతం మావోయిస్టులు తమ ఆయుధాల తయారీకి,సైనిక శిక్షణకు ఉపయోగిస్తున్నట్టు సాయుధబలగాలు కనుగొన్నాయి.దాదాపు 3 సంవత్సరాలుగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీతో పాటు,ఆ పార్టీ అగ్ర నాయకులు అక్కడ మకాం వేసినట్లు గుర్తించారు.
కాగా ”మావోయిస్టు పార్టీని నిర్మూలించడం అసాధ్యం.కాల్పుల విరమణ ప్రకటించి, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం.మోడీ ప్రభుత్వం శాంతి చర్చలకు సిద్ధమా…? కాదా..! స్పష్టం చేయాలి.మేము తెలంగాణ, ఛత్తీస్గడ్ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాలేదు.16 రాష్ట్రాల్లో మా పార్టీ పనిచేస్తోంది.శాంతి చర్చల అంశంపై తెలంగాణ, చత్తీస్గడ్ రాష్ట్రాలు స్పందిస్తే సరిపోదు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా మా ప్రకటన పట్ల ప్రతిస్పందించాలి. కర్రెగుట్టల్లో 26 మంది ఉద్యమకారులను కోల్పోయాం.చర్చల ప్రక్రియ కొనసాగుతుండగా ఈ హత్యాకాండ జరపడాన్ని ఖండిస్తున్నాం.మమ్మల్ని ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్, చత్తీస్గడ్ మంత్రి విజయ్ శర్మ మాట్లాడారు.ఈ విషయంపై మా పార్టీలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.సాయుధ బలగాలు మా ఉద్యమ ప్రాంతాలను చుట్టుముట్టి ఉన్నాయి.అందువల్ల మా పార్టీ కోర్ కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోలేకపోతోంది.సమయావధితో కూడిన కాల్పుల విరమణకు నేను ప్రతిపాదించాను.మా పార్టీ కేడర్ కు రక్షణ లేని పరిస్థితుల్లో ఆయుధాలు విడిచిపెట్టి ప్రభుత్వంతో చర్చకు రావడం అసాధ్యం.కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటిస్తే మా పార్టీ సెంట్రల్ కమిటీ సమావేశమై నిర్ణయాలు తీసుకుంటుంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం సమయావధితో కూడిన కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలకు రావాల్సిందిగా కోరుతున్నాను.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే విప్లవాన్ని బలపడేలా చేస్తాయి.ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే మా సాయుధ పోరాటం పునాది లేకుండా పోతుంది.అంతేగాని రాజ్య హింసతో మా ఉద్యమాన్ని అణచివేయడం సాధ్యం కాదు.ఆపరేషన్ కగార్ ను ఆపేందుకు సామాజిక కార్యకర్తలు ముందుకు రావాలి”అని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ మే 13 న ఒక లేఖ విధుల చేశారు.ఈ లేఖ విడుదల అయిన కొద్దీసేపటికే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా స్పందించారు.”మావోయిస్టులను తుడిచిపెడతాం.చర్చల ప్రసక్తి లేదు” అని ఆయన స్పష్టం చేశారు.
”జవాబుదారీతనం లేని హత్యాకాండ.దీన్ని అంతర్యుద్దంగా ప్రకటించాలి”అని జాతీయ స్థాయిలో ఏర్పడ్డ కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ (శాంతి సమన్వయ కమిటీ) మే 16 న డిమాండ్ చేసింది. పెద్ద ఎత్తున జరిపిన హత్యలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఈ డిమాండ్ చేస్తోంది.
”మీడియాకు చూపిన ఆధారాలు చాలా తీవ్రమైన ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి.మరణించినవారి మృతదేహాలు కనీసం ఐదు రోజులు ఆలస్యంగా, కుళ్ళిపోయిన దుస్థితిలో ఉన్నాయి.భద్రతా బలగాలు మావోయిస్టులుగా అనుమానిస్తున్నవారిని చట్టబద్ధంగా అరెస్టు చేయడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదని అర్థం అవుతోంది.చంపిన ప్రతి ఒక్కరి పేరు మీద ప్రోత్సాహకంగా భారీగా నగదు బహుమతులు అదే హత్యలు చేసిన బలగాలకే ఇవ్వబడ్డాయట! అంతేగాక, ఈ సంయుక్త ఆపరేషన్‌ను ఏ అధికారులు నడిపించారన్న అంశంలో పారదర్శకత పూర్తిగా లోపించడం మరింత ఆందోళనకరమైన విషయం” అని శాంతి సమన్వయ కమిటీ పేర్కొంది.
”2024 నుండి నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లు తీవ్రమయ్యాయి.ఎంతమందిని చంపామా అనేదే ఏకైక గీటు రాయి అయ్యింది.ఒక వైపు మావోయిస్టు కేడర్ లొంగుబాటు, పునరావాసాల’తో పాటు మరోవైపు ఈ ఆపరేషన్లు కొనసాగుతున్నవి.శాంతి చర్చల కోసం పలువురు మేధావులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఆపరేషన్లు జరిగాయి. ఆత్మ రక్షణ కోసం తప్ప మిగతా దాడులు ఆపుతామని, ఏక పక్షంగా కాల్పుల విరమణను ప్రకటించి, శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు తెలిపిన సమయంలోనే కర్రెగుట్టల్లో ఈ ఆపరేషన్ జరిగింది. మావోయిస్టుల మొదటి పత్రికా ప్రకటన మార్చ్ 28న వెలువడితే,21 ఏప్రిల్ నుండి ఈ ఆపరేషన్ ను మొదలు పెట్టారు.మే 10 ఉదయం మొత్తం ఈ ఆపరేషన్ సాధికారతనే ప్రశ్నించేదిగా ఉంది. పారామిలిటరీ బలగాలు ఏ జవాబుదారీతనం లేకుండా హత్యాకాండ కొనసాగిస్తున్నదని అర్థం అవుతోంది.గత రెండు సంవత్సరాలుగా అరెస్టుల కంటే చంపడానికే ప్రాధాన్యతను ఇస్తున్నారు.అంతే కాక,ఆ గ్రామాల్లో నివసించే సాధారణ ఆదివాసీలను లేదా,మావోయిస్టులతో సంబంధం ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని చంపుతున్నట్టు దర్యాప్తులో వెల్లడవుతోంది.మృతుల వివరాలను, వారి సంబంధాలను, పోస్టుమార్టం నివేదికలు తదితర సమాచారాన్ని వెంటనే ప్రజల ముందుకు తేవాలని ప్రభుత్వాన్ని ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి బఘేల్ డిమాండ్ చేశారు”.
”హెలికాప్టర్లు దిగడం,అడవులపై భారీ బాంబుల వర్షం కురిపించడం, భారత జెండాను ఎగరవేయడం వంటి దృశ్యాలను లోకల్ మీడియాకు అనధికారికంగా విడుదల చేసారు. అమిత్ షా ప్రకటించిన లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఈ పద్ధతులను వినియోగిస్తున్నారంటే, అంతర్జాతీయ చట్టాల ప్రకారం, దీన్ని అంతర్యుద్ధంగా ప్రకటించి, యుద్ధ నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సిన అవసరం ఉంది.మృతదేహాలను సురక్షితంగా ఉంచడానికి ఏ ప్రయత్నమూ చేయలేదు.పోలీసులు విడుదల చేసిన ఫొటోలను,వివరాలను చూస్తే, మృతుల్లో కొందరు కేవలం 16 ఏళ్ల వయసులోనే ఉన్నట్లు కనిపిస్తోంది.ఎవరి మృతదేహాన్నైనా సరే గౌరవంగా సమాధి చేయవలసి ఉండగా,జెనీవా ఒప్పందం,రెడ్ క్రాస్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన విధానం మధ్య భారతదేశంలో మోహరించిన పారామిలిటరీ బలగాలు ఎంత అమానవీయంగా వ్యవహరించాయో సూచిస్తుంది.ఆదివాసీల పట్ల,ఇతర మూలవాసీల పట్ల మరణానంతరం కూడా అమానవీయంగా వ్యవహరించడాన్ని చూపిస్తుంది.పదవీవిరమణ చేసిన సుప్రీం కోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తుల నాయకత్వంలో ప్రజాస్వామ్యవాదులు / మానవ హక్కుల కార్యకర్తల బృందం ద్వారా స్వతంత్ర విచారణ జరపాలి”పియూసిఎల్ అఖిల భారత అధ్యక్షులు కవిత శ్రీవాత్సవ,కోఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ కో-కన్వీనర్ క్రాంతి చైతన్య భారత్ బచావో ఆందోళన్, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎంఎఫ్. గోపీనాథ్ డిమాండ్ చేశారు. మేధావులు,ప్రజాస్వామిక,మానవ హక్కుల కార్యకర్తలు ఎంత మంది విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు వస్తుందనే సూచనలేమీ లేవు.
భారత ప్రభుత్వం మావోయిస్టు తిరుగుబాటును ఎదుర్కోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా మానవరహిత వైమానిక వాహనాల వాడకం కీలకమైన అంశం. తరచుగా డ్రోన్లు అని పిలువబడే ఈ వాహనాలను నిఘా పెట్టడం సహా,టార్గెట్ గుర్తింపునాకు వాడుతున్నట్టు ఇదివరకే ఆరోపణలు వచ్చాయి.యుఎవిలను ప్రధానంగా ప్రభుత్వం ఉపయోగిస్తుండగా, మావోయిస్టులు కూడా నిఘా సేకరణ కోసం యుఎవిలను ఉపయోగిస్తున్నట్లు లేదా ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నట్లు కనుగొన్న సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వం వ్యూహాత్మకంగా నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల కోసం మానవ రహిత వైమానిక వాహనాల స్థావరాన్ని హైదరాబాద్ నుండి ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ పట్టణానికి దగ్గరకు మార్చింది.బస్తర్ ప్రాంతాల్లో మావోయిస్టుల నిఘా డ్రోన్ లను చాలాకాలం కిందటే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.భద్రతా శిబిరాల చిత్రాలను లేదా దళాల కదలికలను పొందడానికి నక్సల్స్ డ్రోన్‌లను ఉపయోగించేందుకు ప్రయత్నించారని అప్పట్లో పోలీసులు చెప్పారు.
మావోయిస్టులు తమ ఆధిపత్యంలోని ప్రాంతాల్లో జనతన సర్కార్ అనే నిర్మాణ రూపం ఇచ్చి దాదాపు పదిహేనేళ్లవుతోంది.అంతకుముందు గ్రామ రాజ్య కమిటీల పేరుతో ఆదివాసుల అధికారం నడిచింది.దాని విస్తృత రూపమే క్రాంతికారీ జనతన సర్కార్.ఆదివాసులు,ఆదివాసేతరుల ఉమ్మడి సంస్థ ఇది.గ్రామస్థాయిలో నడుస్తున్న జనతన సర్కార్లను బలోపేతం చేస్తూ 2008లో మావోయిస్టు పార్టీ సర్కార్ రాజ్యాంగాన్ని ప్రకటించింది. దీని ప్రకారం జనతన సర్కార్ మావోయిస్టు ఉద్యమంలో భాగమైన నాలుగు వర్గాల అధికార రూపం.తన ఆధీన ప్రాంతంలో జనతన సర్కార్ వ్యవసాయం, నీటిపారుదల, విద్య, వైద్యం మొదలైన రంగాల్లో సాధించిన పురోగతిని,వారి ప్రత్యామ్నాయ అభివృద్ధిలోని ప్రజా భాగస్వామ్యాన్ని తెలుసుకోవాలంటే దండకారణ్యంలో పర్యటించవలసిందే. 2007 నుంచి మాత్రం పంచాయతీ,ఏరియా,డివిజన్,జోనల్ స్థాయిల్లో జనతన సర్కార్ పనిచేస్తోంది.జనతన సర్కార్ రక్షణ కోసమే ప్రజా మిలీషియాలో ఒక విభాగంగా భూంకాల్ సైన్యం ఏర్పడింది. సల్వాజుడుం, ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ల మధ్యనే వ్యవసాయం, విద్య, వైద్యం, న్యాయం,నీటిపారుదల,రక్షణ మొదలైన రంగాల్లో అభివృద్ధి సాధించినట్టుగా మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు చెబుతున్నారు.ప్రజా మిలీషియా ఊరుకూ,మా స్కూలుకూ సెంట్రీ కాస్తుంది.రాత్రి అన్నం తిన్నాక రెండు గంటల పాటు ఆదివాసీలు కూడా వంతువారీగా సెంట్రీ డ్యూటీ చేస్తారు.ప్రజల్లో తరతరాలుగా ఉన్న మూలికా వైద్య జ్ఞానాన్ని ‘మావా జంగల్.. మావా దవాయి’అనే గోండీ పుస్తకంగా జనతన సర్కార్ అచ్చేసింది.శరీర నిర్మాణం,వ్యాధి కారకాలను తెలిపే మెడికల్ గైడ్‌ను కూడా గోండీలో ప్రచురించింది.వైద్య కార్యకర్తలు గ్రామాల్లోనే గాక,ప్రజా సైన్యం వెంట కూడా సంచారంలో ఉంటారు.కాల్పుల్లో గాయపడ్డ వాళ్ళను వెంటనే పక్కకు తీసికెళ్ళి ఆపరేషన్ చేసి తూటాలు తొలగించి కాపాడుతారు.ఇంతవరకు ఆపరేషన్ చేసిన వాళ్ళంతా కోలుకొని తిరిగి సైన్యంలోకి వెళ్ళిపోయారు.గతంలో కొన్ని ఆదివాసీ తెగల్లో ప్రసవ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ప్రసవ మరణాలు,ఆ తర్వాత మాతా శిశు మరణాలు ఎక్కువగా ఉండేవి.
జనతన సర్కారు వైద్య కార్యకర్తలు గ్రామాల్లో గర్భిణిలను గుర్తించి మొదటి నుంచే బలానికి మాత్రలు ఇస్తున్నారు.ముఖ్యంగా అందుబాటులో ఉన్నవాటి నుంచే పోషకాహారం ఎలా తీసుకోవాలో,శుభ్రత ఎలా పాటించాలో నేర్పుతున్నారు.దీంతో దండకారణ్యంలో ఇప్పుడు ప్రసవ మరణాలు,శిశు మరణాలు చాలావరకు తగ్గిపోయాయి.మావోయిస్టు ఉద్యమం వచ్చాక చిన్న వయసులో అమ్మాయిలకు పెళ్ళి చేసే పరిస్థితి పూర్తిగా పోయింది. వ్యవసాయ శాఖ కూరగాయల సాగు అలవాటు చేయడంతో పోషకాహారం కూడా అందుతోంది.ప్రతి ఊళ్ళో కూరగాయల తోటలు కనిపిస్తుంటాయి.మంచినీళ్ళ బావి నుంచి,బోరింగ్‌ల నుంచి కాలువలు తీసి వృధాగా పోయే నీళ్ళు కూరగాయల తోటలకు సరఫరా చేస్తున్నారు.
ప్రతి ఏరియాలో విత్తనాల బ్యాంకు ఉంటుంది.అది ఏ పంటకు ఎన్ని విత్తనాలు కావాల్సిందీ జనతన సర్కారు సమకూర్చుతుంది.దండకారణ్యంలో సహకార వ్యవసాయంతో పాటు ప్రతి ఊళ్ళో సమిష్టి వ్యవసాయం కూడా కొంత నడుస్తోంది.ఇందులో అందరూ పని చేస్తారు.పంట మూడు భాగాలు చేసి ఒక భాగం గ్రామస్తులకు,మిగతా రెండు భాగాలు సర్కారుకు,ప్రజా విముక్తి సైన్యానికి కేటాయిస్తారు.గ్రామస్తుల పొలాల్లో లేదా సమష్టి పొలాల్లో సైన్యం,ప్రజామిలీషియా కూడా రక్షణ పనులతో పాటు వ్యవసాయంలోనూ పాల్గొంటాయి. సమష్టి పొలంలో సర్కారు వాటా కింద వచ్చిన దాంట్లోంచి విత్తనాలకు తీసిపెట్టి మరుసటి సీజన్‌లో సరఫరా చేస్తారు.ఇంకా అవసరం అయితే పంట రాగానే ముందుగానే రైతుల నుంచి సేకరిస్తారు.ఒక్కోసారి సల్వాజుడుం,గ్రీన్‌హంట్ దాడుల వల్ల అప్పుడప్పుడూ కొన్ని వ్యవసాయ క్షేత్రాల్లో పంట నాశనం అవుతుంది.కొన్ని చోట్ల అన్ని పొలాల్లో సాగు చేయడానికి వీలు కాదు.అప్పుడు పక్క సర్కార్లు ధాన్యం సరఫరా చేస్తాయి.ఇప్పటికీ అక్కడక్కడా పోడు వ్యవసాయం ఉన్నప్పటికీ చాలావరకు స్థిర-సహకార, సమష్టి వ్యవసాయమే జరుగుతోందని చెప్పవచ్చు. ఒక్క పంటకు తప్పనిసరిగా సాగు నీరు అందేలా చెరువులు,కుంటలు తవ్వుకున్నారు.అయితే కొన్ని వర్షాధార భూములూ ఉన్నాయి.అట్లాగే రెండు పంటలు తీయడానికి తగినంత సాగు నీరు అందుతున్న పొలాలు కూడా ఉన్నాయి.సేంద్రియ ఎరువులు,స్థానిక వంగడాలతోనే తిండికి,మరుసటి ఏడాది విత్తనాలకు,ఇతర ప్రాంతాలకు సాయం చేయడానికి ఉంచుకుని చాలామంది రైతులు వ్యాపారులకు వడ్లు,పెసర,నువ్వులు వంటివి విక్రయిస్తున్నారు.
దండకారణ్యంలో అమాయక ఆదివాసులపై పోలీసుల దాడులను ఖండించి వాళ్ల హక్కులు కాపాడాలని కొంతమంది మేధావులు అంటుంటారు.దండకారణ్యంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ఆదివాసులు విప్లవోద్యమం నిర్మిస్తున్నారు,అది ఈ వ్యవస్థకు ప్రత్యామ్నాయం కాబట్టి భారత ప్రభుత్వం వాళ్లపై యుద్ధం చేస్తోంది అనే వాదన ఉంది. ”చైనా పరిస్థితి వేరు.భారత్ లోని కేంద్రీకృత రాజకీయ వ్యవస్థ వేరు.భారత్ లో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడానికి మావో సూత్రీకరణ,ఎత్తుగడలనే నక్సలైట్లు ఇక్కడ అవలంబించారు.అప్పటి చైనా దృష్టాంతానికి భిన్నమైన సంగతి గ్రహించకుండా మావోయిస్టు తరహా గెరిల్లా పోరాటాలు చేపట్టారు. 1960 -1970 ప్రాంతాల్లో నక్సల్బరీ,శ్రీకాకుళంలో ఉవ్వెత్తున ఎగసిపడ్డ నక్సలైట్ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలబడ్డ రైతాంగం పోలీసు అణచివేతతో ఉద్యమం వదిలిపెట్టేశారు.మధ్య భారతంలోని ఛత్తీస్ గఢ్,జార్ఖండ్ లలో,తెలంగాణ సరిహద్దుల్లో దుర్బేధ్యమైన అడవులు,కొండప్రాంతాల్లో మినహా గెరిల్లా సైన్యాలకు ఎక్కడా సురక్షితమైన ప్రదేశం లేకపోవడం మావోయిస్టు పార్టీ పంథా వైఫల్యం.మావోయిస్టు అగ్రనాయకుడు మల్లోజుల కోటేశ్వరరావును నమ్మించి మమతా బెనర్జీ ప్రభుత్వం ఎన్ కౌంటర్ చేసింది.అంతకు ముందు మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి కారకుడైన కిషన్ జీ తాను చేసిన తప్పుకు తానే భారీ మూల్యం చెల్లించుకున్నారు. దేశ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ,వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు,మొత్తం సమాజం ఎదుర్కుంటున్న నయా ఉదారవాద పెట్టుబడిదారీ లక్షణాలను ఎదుర్కునేందుకు మావోయిస్టులు సరికొత్త వ్యూహాన్ని రచించాలి.” అని సుప్రసిద్ధ రచయిత,నక్సలైట్ ఉద్యమ విశ్లేషకుడు సుమంత బెనర్జీ ఒక వ్యాసంలో సూచించారు.
మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ తాజాగా విడుదల చేసిన లేఖలో,ఆ పార్టీ తన విధానాల ‘మార్పు’ గురించి సూచనప్రాయంగా కొన్ని విషయాలు కనిపిస్తున్నవి.1. ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసే విషయంపై పార్టీలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.2. సాయుధ బలగాలు మా ఉద్యమ ప్రాంతాలను చుట్టుముట్టినందున పార్టీ కోర్ కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోలేకపోతోంది.3.కాల వ్యవధితో కూడిన కాల్పుల విరమణకు పార్టీ ప్రతిపాదించింది.4. పార్టీ కేడర్ కు రక్షణ లేని పరిస్థితుల్లో ఆయుధాలు విడిచిపెట్టి ప్రభుత్వంతో చర్చకు రావడం అసాధ్యం.5.కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటిస్తే మా పార్టీ సెంట్రల్ కమిటీ సమావేశమై నిర్ణయాలు తీసుకుంటుంది.5. కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలకు రావాలి.6.ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే విప్లవాన్ని బలపడేలా చేస్తాయి.7. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే మా సాయుధ పోరాటం పునాది లేకుండా పోతుంది.8. రాజ్య హింసతో మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేయడం సాధ్యం కాదు.వీటిలో జనజీవన స్రవంతి గురించిన ప్రస్తావన,ప్రజా సమస్యలు పరిష్కరిస్తే తమ సాయుధపోరాటాల పునాది ఉండదు అనే వ్యాఖ్య పలువురు మావోయిస్టు సానుభూతిపరులు,మద్దతుదారులు,హింసను నిలిపివేయాలని కోరుతున్న బుద్ధిజీవులను ఆలోచింపజేస్తున్నవి.