ఢిల్లీలో పాత వాహనాలపై ఉక్కుపాదం..భారీ జరిమానాలతో హెచ్చరిక
ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు అధికారులు మరింత కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పాత వాహనాల విషయంలో ఎలాంటి సడలింపులు ఇవ్వబోమని స్పష్టంగా ప్రకటించారు.
- Author : Latha Suma
Date : 18-12-2025 - 12:19 IST
Published By : Hashtagu Telugu Desk
. కాలుష్య నియంత్రణ కోసం కఠినంగా వ్యవహరిస్తున్న అధికారులు
. బార్డర్ నుంచే పాత వాహనాలను వెనక్కి పంపిస్తున్న వైనం
. కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి తాము మూల్యం చెల్లించాల్సి వస్తోందంటున్న వాహనదారులు
Traffic police restrictions : దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు అధికారులు మరింత కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పాత వాహనాల విషయంలో ఎలాంటి సడలింపులు ఇవ్వబోమని స్పష్టంగా ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దుల్లోనే కాకుండా నగరంలోని ప్రధాన రహదారులు, అంతర్గత ప్రాంతాల్లోనూ ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. కాలుష్య నియంత్రణ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం బీఎస్-4 మరియు అంతకన్నా ఉన్నత ప్రమాణాలు కలిగిన వాహనాలకే ఢిల్లీలో ప్రవేశం కల్పిస్తున్నారు. బీఎస్-3 ప్రమాణాలు లేదా అంతకన్నా తక్కువగా ఉన్న కార్లు, ఇతర వాహనాలను నగరంలోకి అనుమతించడం లేదు.
ఈ నిబంధనలు అతిక్రమించి పాత వాహనాలతో నగరంలోకి రావడానికి ప్రయత్నిస్తే భారీ జరిమానాలు విధిస్తున్నారు. ముఖ్యంగా బీఎస్-3 కార్లతో పట్టుబడితే రూ.20 వేల వరకు ఫైన్ వేస్తామని అధికారులు స్పష్టం చేశారు. చెక్ పోస్టుల వద్దే పాత వాహనాలు గుర్తిస్తే వెంటనే వెనక్కి మళ్లించాలని ఆదేశిస్తున్నారు. జరిమానా తప్పించుకోవాలంటే సరిహద్దు నుంచే తిరిగి వెళ్లిపోవాల్సిందేనని ట్రాఫిక్ సిబ్బంది చెబుతున్నారు. ఢిల్లీలో నివసించే పాత వాహనాల యజమానులకూ పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. కాలుష్య నియంత్రణకు సహకరించకుండా రోడ్లపైకి వస్తే రూ.20 వేల జరిమానా తప్పదని తేల్చిచెప్పారు. నగరం నలుమూలలా ఏర్పాటు చేసిన చెక్ పాయింట్ల వల్ల తప్పించుకునే అవకాశమే లేదని అధికారులు అంటున్నారు.
అయితే ఈ తనిఖీలతో ఢిల్లీతో పాటు ఫరీదాబాద్, గురుగ్రామ్ వంటి పరిసర ప్రాంతాల వాహనదారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కాలుష్య నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యానికి సామాన్య ప్రజలే మూల్యం చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. తాజాగా అమల్లోకి వచ్చిన నిబంధనలపై సరైన అవగాహన లేకుండా పాత కారుతో ఢిల్లీకి వచ్చిన ఫరీదాబాద్ వాసి ఒకరు స్పందిస్తూ, ట్రాఫిక్ పోలీసులు కార్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుని తనిఖీలు చేస్తున్నారని అన్నారు.
తాము రోడ్ ట్యాక్స్‌తో పాటు ఇతర అన్ని పన్నులు చెల్లించామని ఆయన గుర్తుచేశారు. ప్రైవేట్ కార్లపైనే చర్యలు తీసుకుంటున్న పోలీసులు ప్రజా రవాణా వ్యవస్థ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా కాలుష్యాన్ని ఎక్కువగా విడుదల చేసే బస్సులను తనిఖీ చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ చర్యలు అందరికీ సమానంగా ఉండాలని, ఒక్క వర్గాన్నే ఇబ్బంది పెట్టడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఢిల్లీలో కాలుష్య నియంత్రణ పేరుతో అమలవుతున్న తాజా ఆంక్షలు వాహనదారులకు గట్టి షాక్ ఇస్తున్నాయి. అధికారులు కఠినంగా వ్యవహరిస్తుండగా, ప్రజలు మాత్రం సరైన ప్రణాళిక లేకుండా తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.