Delhi AAP MLA: స్కూల్ ప్రిన్సిపాల్ కేసులో దోషిగా ఆప్ ఎమ్మెల్యే
2009లో స్కూల్ ప్రిన్సిపాల్ రజియా బేగంపై దాడి చేసిన కేసులో ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్‌కు చెందిన ఆప్ ఎమ్మెల్యే అబ్దుల్ రెహమాన్, అతని భార్య అస్మాను రోస్ అవెన్యూ కోర్టు దోషులుగా నిర్ధారించింది.
- By Praveen Aluthuru Published Date - 09:13 AM, Sun - 30 April 23

Delhi AAP MLA: 2009లో స్కూల్ ప్రిన్సిపాల్ రజియా బేగంపై దాడి చేసిన కేసులో ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్‌కు చెందిన ఆప్ ఎమ్మెల్యే అబ్దుల్ రెహమాన్, అతని భార్య అస్మాను రోస్ అవెన్యూ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఎమ్మెల్యే అబ్దుల్ రెహమాన్, అతని భార్య ఆస్మా రజియాను కొట్టారని, చంపేస్తామని బెదిరించి, దుర్భాషలాడారని, విధులకు ఆటంకం కలిగించారని వారిద్దరిపై ఆరోపణలు ఉన్నాయి. IPCలోని 353/506 మరియు 34 సెక్షన్ల కింద కోర్టు ఇద్దరినీ దోషులుగా నిర్ధారించింది.
సెక్షన్ 332 ప్రకారం అస్మాను కూడా దోషిగా నిర్ధారించారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ప్రత్యక్ష సాక్షుల్లో ఒక్కరు కూడా తమ వాంగ్మూలాన్ని నమోదు చేయలేదు. ఒక రోజు తర్వాత ఈ కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ ఘటన 2009 ఫిబ్రవరి 4న జరగ్గా, ఒకరోజు తర్వాత ఫిబ్రవరి 5న కేసు నమోదైంది.
అసలు ఇంతకీ ఏమైందంటే.. జఫ్రాబాద్‌లోని జీనత్ మహల్ సర్వోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ రజియా బేగం సీలంపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 9 గంటల ప్రాంతంలో అబ్దుల్ రెహమాన్ భార్య అస్మా పాఠశాల లోపలికి వచ్చింది. అస్మా ప్రిన్సిపాల్‌ని చెంపదెబ్బ కొట్టింది. కొంతసేపటికి భర్త అబ్దుల్ రెహమాన్ తన సహచరులతో కలిసి స్కూల్ లోపలికి వచ్చాడు. రజియాను చంపేస్తానని అబ్దుల్ బెదిరించాడు. ఆమెతో దుర్భాషలాడారు.
ఈ కేసులో అబ్దుల్, అతని భార్య అస్మాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు సాక్ష్యాధారాల ఆధారంగా అబ్దుల్ రెహమాన్, అతని భార్య అస్మాను దోషులుగా నిర్ధారించింది. ప్రస్తుతం అబ్దుల్ రెహమాన్ సీలంపూర్ అసెంబ్లీ నుంచి ఆప్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
Read More: Chennai: చెన్నైలో షాకింగ్ ఘటన.. విమానాశ్రయంలో వివాహిత ఆత్మహత్య