Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో డాక్టర్ షాహీన్ షాహిద్ అరెస్ట్.. ఎవరీ మహిళ?
గూఢచార వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మిషన్‌ను షాహీన్‌కు అప్పగించింది మరెవరో కాదు జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరి అయిన సాదియా అజార్. సాదియా పాకిస్థాన్‌లో మహిళా విభాగానికి చీఫ్‌గా పరిగణించబడుతోంది.
- By Gopichand Published Date - 08:55 PM, Tue - 11 November 25
Delhi Car Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు (Delhi Car Blast) ఘటన దేశ రాజధానిని కలవరపెట్టింది. ఈ దాడిలో 12 మంది మరణించారు. ఈ పేలుడు ఘటనపై ఎన్ఐఏ (NIA), ఎఫ్‌ఎస్‌ఎల్ (FSL), ఎన్‌ఎస్‌జి (NSG), ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. గత రాత్రి (నవంబర్ 10న) కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. “ఈ దాడిలో పాల్గొన్న ఏ ఒక్క నిందితుడిని కూడా వదిలిపెట్టేది లేదు. ఈ కేసు మూలాలను కూడా ఛేదిస్తాం” అని పేర్కొన్నారు.
ఈ కేసులో తాజాగా షాహీన్ షాహిద్ అనే కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఫరీదాబాద్‌లో అరెస్టు అయిన షాహీనా వృత్తిరీత్యా డాక్టర్. ఆమెకు ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ (Jaish-e-Mohammed) మహిళా విభాగం “జమాత్-ఉల్-మోమినత్” ఇండియా కమాండ్ బాధ్యతలను అప్పగించినట్లు వెల్లడైంది.
ఎవరు ఈ షాహీనా షాహిద్?
ఢిల్లీ కారు పేలుడు కేసు దర్యాప్తులో జైషే మహమ్మద్, అన్సార్ గజ్వత్-ఉల్-హింద్ సంస్థలకు చెందిన ‘సఫేద్ పోష్’ (తెల్ల దుస్తులు ధరించిన/సామాన్య పౌరులుగా కనిపించే) ఉగ్రవాద మాడ్యూల్ గుట్టు రట్టయింది. అరెస్ట్ అయిన లేడీ డాక్టర్ షాహీన్ షాహిద్‌కు జైష్‌తో నేరుగా సంబంధాలు ఉన్నట్లు వెల్లడవుతోంది. లేడీ డాక్టర్ షాహీన్, జైషే మహిళా విభాగానికి చెందిన ‘జమాత్-ఉల్-మోమినత్’ ఇండియా హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో ఎక్కువ మంది మహిళలను ఉగ్రవాద గ్రూపుల్లో చేర్చడమే ఆమె లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: Car Tyre: కారు ఉన్నవారికి అలర్ట్.. టైర్లను ఎప్పుడు మార్చాలంటే?
భారత్‌లో షాహీనా పాత్ర ఏంటి?
గూఢచార సంస్థల సమాచారం ప్రకారం.. భారత్‌లో మహిళలను కమ్యూనల్ (మత) భావజాలంతో ప్రభావితం చేయడం, సంస్థ కోసం వారిని రిక్రూట్మెంట్ (భర్తీ) చేయాలనే బాధ్యతను షాహీన్‌కు అప్పగించారు. ఈ మహిళా విభాగం జైష్ కొత్త వ్యూహంలో భాగం. ఇందులో మానసిక యుద్ధం, ప్రచారం, నిధుల సేకరణ వంటి కార్యకలాపాలు ఉన్నాయి.
పాకిస్థాన్‌లో మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ ఈ సంస్థకు నాయకత్వం వహిస్తోంది. సాదియా భర్త యూసుఫ్ అజార్ కందహార్ హైజాక్ కేసులో కీలక సూత్రధారి. మతపరమైన బాధ్యతలు, జిహాద్ పేరుతో మహిళలను చేర్చుకోవాలని జైష్ ప్లాన్ చేసింది. వారికి శిక్షణ ఇచ్చి సంస్థ మిషన్‌లో భాగం చేస్తుంది. భారత్‌లో కూడా షాహీన్ వంటి వ్యక్తుల సహాయంతో ఈ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు కుట్ర పన్నారు.
మసూద్ అజార్ సోదరి అప్పగించిన బాధ్యత
గూఢచార వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మిషన్‌ను షాహీన్‌కు అప్పగించింది మరెవరో కాదు జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరి అయిన సాదియా అజార్. సాదియా పాకిస్థాన్‌లో మహిళా విభాగానికి చీఫ్‌గా పరిగణించబడుతోంది. ప్రస్తుతం భద్రతా ఏజెన్సీలు డాక్టర్ షాహీన్ డిజిటల్ నెట్‌వర్క్, సోషల్ మీడియా కనెక్షన్‌లు, ఆమెకు మద్దతిచ్చే ఇతర వ్యక్తుల కోసం గాలిస్తున్నాయి. ఈ విషయం జైష్ ఇప్పుడు భారత్‌లో మహిళలను ఉగ్రవాదానికి కొత్త ముఖాలుగా ఉపయోగించడానికి కుట్ర పన్నుతోందని స్పష్టం చేస్తోంది.