Congress Apology: క్షమించండి… రాష్ట్రపతికి అధిర్ రంజన్ చౌదరి లేఖ
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వివాదంలో ఎట్టకేలకు ఎంపీ అధిర్ రంజన్ చౌదరి క్షమాపణ చెప్పారు.
- Author : Naresh Kumar
Date : 29-07-2022 - 11:16 IST
Published By : Hashtagu Telugu Desk
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వివాదంలో ఎట్టకేలకు ఎంపీ అధిర్ రంజన్ చౌదరి క్షమాపణ చెప్పారు. ఈమేరకు రాష్ట్రపతికి లేఖ రాసి క్షమాపణలు కోరారు. పొరపాటుగా నోరుజారడం వల్లే ఆ పదం మాట్లాడినట్లు పేర్కొన్నారు. తన తప్పును క్షమిస్తారని ఆశిస్తున్నట్లు లేఖలో రాసుకొచ్చారు.అవి పొరపాటున చేసిన వ్యాఖ్యలని, అయినా క్షమాపణలు చెబుతున్నానని వివరించారు. పొరపాటున మీ హోదాకు సంబంధించి తప్పుడు పదం వాడాను. అందుకు ఎంతో బాధ పడుతున్నాను. విచారం వ్యక్తం చేస్తున్నాను. నా క్షమాపణలను స్వీకరించాలని కోరుతున్నానని ఆ లేఖలో అధిర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు.
పార్లమెంటులో మాట్లాడుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘రాష్ట్రపత్ని’ అని అధిర్ రంజన్ చౌదరి అన్నారు . ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
ఎంపీ అధిర్ రంజన్ చౌదరితో పాటు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కూడా రాష్ట్రపతి ముర్ముకు క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఆ సమయంలో బీజేపీ సభ్యురాలు రమాదేవి వద్దకు వెళ్లిన సోనియా.. ఈ వివాదంలో తన పేరు ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ జోక్యం చేసుకుంది. దాంతో, సోనియా గట్టిగా డోంట్ టాక్ టు మి అంటూ స్మృతి ఇరానీపై మండిపడ్డారు. శుక్రవారం కూడా ఉభయ సభలలో ఇదే అంశంపై నిరసనలు కొనసాగాయి. దీంతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. అనంతరం అధిర్ రంజన్ చౌదరి క్షమాపణలు చెబుతూ లేఖ రాయడంతో ఈ వివాదం సద్దుమణిగినట్టే కనిపిస్తోంది.