Congress Meeting : ఇండియా నుంచి భారత్ పేరు మార్పు.. అత్యవసరంగా సమావేశం అయిన కాంగ్రెస్..
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ నివాసంలో పార్లమెంటరీ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు.
- By News Desk Published Date - 10:00 PM, Tue - 5 September 23

దేశం పేరును ఇండియా(India) నుంచి భారత్(Bharat) గా మార్చే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా.. నేడు ఉదయం నుంచి జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణమేంటో తెలిసిందే. జీ20 సదస్సు(G20 Summit) కోసం ఆయా దేశాల అధినేతలు, ప్రతినిధులకు పంపిన విందు ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ గా ముద్రించడం, దీనిపైనే అస్సాం ముఖ్యమంత్రి ఆసక్తికరంగా ట్వీట్ చేయడంతో.. ఈ ఊహాగానాలు మొదలయ్యాయి.
దీంతో ఎక్కడ చూసినా భారత్ పేరు వైరల్ అవుతుంది. ప్రతిపక్షాలు దీన్ని తప్పుపడుతుంటే.. నెటిజన్లు, పలువురు ప్రముఖులు మేరా భారత్ మహాన్ అని సపోర్ట్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ నివాసంలో పార్లమెంటరీ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. తదుపరి కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సోనియా నివాసంలో సమావేశం ముగిసిన అనంతరం.. I.N.D.I.A కూటమి నేతలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో భేటీ కానున్నారు. దేశం పేరును ఇకపై భారత్ గానే పిలవాలని కేంద్రం నిర్ణయిస్తే.. తమ కూటమి పేరులో కూడా ఏమైనా మార్పులు చేయాలా ? లేక I.N.D.I.A కూటమి గానే ఎన్నికలకు వెళ్లాలా ? అనే విషయాలపై ఖర్గే నివాసంలో చర్చిస్తారని తెలుస్తోంది. ఈ కూటమి పేరు కారణంగానే.. కేంద్రం ఇండియా నుంచి భారత్ గా మార్చాలని భావిస్తుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అలాగే ఈనెల 18 నుంచి 22 వరకు నిర్వహించే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భారత్ గా పేరు మార్చేందుకు కేంద్రం ప్రతిపాదనలు చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
Also Read : Sehwag : టీం ఇండియా కాదు.. టీం భారత్.. జెర్సీలపై కూడా అలాగే మార్చాలంటూ సెహ్వాగ్ ట్వీట్..