Delhi LG : కోచింగ్ సెంటర్ ఘటన..విద్యార్థులను కలిసిన ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్
ఈ సందర్భంగా ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా ఓల్డ్ రాజిందర్ నగర్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థులతో మాట్లాడుతూ.. ఈ కేసులో కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
- By Latha Suma Published Date - 02:52 PM, Mon - 29 July 24

Delhi LG : దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లో సివిల్స్ కోచింగ్ సెంటర్(Civils Coaching Centre) బేస్‌మెంట్‌లోకి వరదనీరు రావడంతో ముగ్గురు విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంలూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓల్డ్ రాజేందర్ నగర్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థులను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(Delhi Lieutenant Governor VK Saxena) కలిశారు. సోమవారం ఉదయం ఇన్‌స్టిట్యూట్ వద్దకు వెళ్లిన ఎల్జీ.. అక్కడ నిరసన తెలుపుతున్న విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఈ ఘటనకు కారణమైన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు ఈ ప్రమాదంపై స్పందించిన ఢిల్లీ ఎల్జీ.. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి సంఘటనలు ఆమోదించదగినవి కాదన్నారు. దీనికి సంబంధించిన ప్రతి అంశాన్ని కవర్ చేసి జూలై 30లోగా నివేదిక సమర్పించాలని డివిజనల్ కమిషనర్‌ను ఆదేశించారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, శనివారం రాత్రి 7 గంటల సమయంలో రావుస్ స్టడీ సర్కిల్ బేస్‌మెంట్‌లోకి ఒక్కసారిగా వరద నీరు చేరింది. ఈ సమయంలో బేస్‌మెంట్‌లో ఉన్న లైబ్రరీలో దాదాపు 18 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 15 మంది ఎలాగోలా బయటపడగా, ముగ్గురు మాత్రం నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వచ్చి వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన తాన్యా సోని(21), ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన శ్రేయ యాదవ్(25), కేరళలోని ఎర్నాకుళంకు చెందిన నవీన్ దల్వైన్(29) వరదనీటిలో మునిగి మరణించారు.