Delhi : ఢిల్లీలో వాయుకాలుష్యం పై సీఎం ఉన్నత స్థాయి సమావేశం
Delhi : గాలి వీచడం, వర్షం, ఉష్ణోగ్రతలు తగ్గిన సమయంలో గాలి నాణ్యత సూచీ పడిపోతుందని పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్ పేర్కొన్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 నుంచి 300 పెరగ్గా యాక్షన్ ప్లాన్‌ని అమలులోకి తీసుకువచ్చారు.
- By Latha Suma Published Date - 05:25 PM, Tue - 15 October 24

Air Pollution: ఢిల్లీలో వాయుకాలుష్యం పెరుగుతున్నది. ఈ క్రమంలో సీఎం అతిశి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) తొలి దశ యాక్షన్ ప్లాన్ ఆంక్షలు మంగళవారం ఉదయం నుంచి ఢిల్లీలో అమలులోకి వచ్చాయి. సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ సబ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గాలి వీచడం, వర్షం, ఉష్ణోగ్రతలు తగ్గిన సమయంలో గాలి నాణ్యత సూచీ పడిపోతుందని పర్యావరణ మంత్రి గోపాల్‌రాయ్ పేర్కొన్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 నుంచి 300 పెరగ్గా యాక్షన్ ప్లాన్‌ని అమలులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే పలు ఆంక్షలు అమలు చేస్తుండగా.. మరిన్ని ఆంక్షలు అమలు చేయనున్నారు.
పాత వాహనాలను నియంత్రించేందుకు కసరత్తు చేస్తున్నారు. బొగ్గు దుకాణాలతో పాటు జనరేట్ల వినియోగంపై నిషేధానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే, హోటల్స్, రెస్టారెంట్లలో కలప వినియోగంపై పూర్తిగా నిషేధం విధించనున్నారు. పాత పెట్రోల్ (బీఎస్-3, డీజిల్ (బీఎస్-4) వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించనున్నారు. అలాగే, నిర్మాణాలు, కూల్చివేత కార్యకలాపాల్లో దుమ్మధూళిని తగ్గించేందుకు చర్యలు చేపట్టనున్నారు. రోడ్లను యంత్రాలతో శుభ్రం చేస్తూ ఎప్పటికప్పుడు నీటిని చల్లనున్నారు. వాహనాలకు సంబంధించి పీయూసీ నిబంధనలను కచ్చితంగా పర్యవేక్షించనున్నారు. వాహనాలలో టైర్ ప్రెజర్ సరిగ్గా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. సిగ్నల్ వద్ద వాహనాలను ఇంజిన్ నిలిపివేయాల్సి ఉంటుంది. మరో వైపు ఢిల్లీలో ఛట్ పూజలకు సన్నాహాలు ప్రారంభయ్యాయి. ప్రభుత్వం ఢిల్లీలో వెయ్యి కంటే ఎక్కువగా ఘాట్‌లను సిద్ధం చేయనున్నది.