GST : జీఎస్టీలో మార్పులు.. ధరలు తగ్గే అవకాశం ఉన్న వస్తువులు ఇవే..!
ప్రస్తుతం జీఎస్టీలో 5%, 12%, 18%, 28% అనే నాలుగు శ్లాబ్‌లు ఉన్నాయి. ఇకపై ఈ విధానాన్ని సరళతరం చేస్తూ... 5% మరియు 18% అనే రెండు ప్రధాన శ్లాబ్‌లను మాత్రమే కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది. దీని ప్రకారం, ప్రస్తుతం 12% శ్లాబ్‌లో ఉన్న వస్తువులలో సుమారు 99% వస్తువులను 5% శ్లాబ్‌లోకి మారుస్తారు. అలాగే 28% శ్లాబ్‌లో ఉన్న వస్తు-సేవల్లో సుమారు 90% శాతం వాటిని 18% శ్లాబ్‌లోకి మార్చనున్నట్లు సమాచారం.
- By Latha Suma Published Date - 01:49 PM, Sat - 16 August 25

GST : దేశీయ పన్ను వ్యవస్థలో క్రాంతికార మార్పుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో కీలక సవరణలు తీసుకురావడానికి కేంద్ర ఆర్థిక శాఖ రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగు శ్లాబ్‌లను రెండు శ్లాబ్‌లుగా సులభతరం చేయాలని ప్రతిపాదిస్తోంది. దీని ద్వారా సామాన్య ప్రజలకు, చిన్న వ్యాపారులకు భారం తగ్గిస్తూ… పన్ను పరంగా నూతన గమ్యం వైపు దేశాన్ని నడిపించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం జీఎస్టీలో 5%, 12%, 18%, 28% అనే నాలుగు శ్లాబ్‌లు ఉన్నాయి. ఇకపై ఈ విధానాన్ని సరళతరం చేస్తూ… 5% మరియు 18% అనే రెండు ప్రధాన శ్లాబ్‌లను మాత్రమే కొనసాగించాలని కేంద్రం యోచిస్తోంది. దీని ప్రకారం, ప్రస్తుతం 12% శ్లాబ్‌లో ఉన్న వస్తువులలో సుమారు 99% వస్తువులను 5% శ్లాబ్‌లోకి మారుస్తారు. అలాగే 28% శ్లాబ్‌లో ఉన్న వస్తు-సేవల్లో సుమారు 90% శాతం వాటిని 18% శ్లాబ్‌లోకి మార్చనున్నట్లు సమాచారం.
దీపావళి నుంచి అమలు?
ఈ మార్పులను దీపావళికి ముందుగానే అమల్లోకి తేవాలని కేంద్రం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. జీఎస్టీ మండలి ఆమోదం లభించిన వెంటనే ఈ కొత్త విధానాన్ని అమలుచేయనున్నారు. దీని ఫలితంగా అనేక అవసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. సామాన్యులకు ఇది నేరుగా ప్రయోజనకరంగా మారనుంది.
లాభపడే రంగాలు
ఈ కొత్త జీఎస్టీ విధానం జౌళి, ఎరువులు, పునరుత్పాదక విద్యుత్తు, ఆటోమోటివ్, హస్తకళలు, వ్యవసాయ ఉత్పత్తులు, వైద్య సేవలు, బీమా వంటి కీలక రంగాలకు లాభం చేకూర్చనుంది. ప్రస్తుతం బీమాపై 18% జీఎస్టీ వసూలవుతున్నా, ఇది 5%కి తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంతేకాక, కొన్ని అత్యవసర వైద్య సేవలు, బీమా సేవలపై జీరో శాతం జీఎస్టీ విధించే యోచన కూడా కేంద్రం పరిశీలిస్తోంది.
సేవల రంగంపై ప్రభావం
ఈ మార్పుల్లో సేవల రంగం మీద ప్రధానంగా ప్రభావం పడనుంది. చాలా సేవలపై ప్రస్తుతం అమల్లో ఉన్న 18% శ్లాబ్‌ను కొనసాగించే యోచనలో ఉన్న కేంద్రం, కొన్ని ప్రత్యేక సేవలపై మాత్రమే తక్కువ పన్ను రేటును అమలు చేయనుంది.
హానికర వస్తువులకు కఠిన చర్యలు
ఇక మరోవైపు, ఆరోగ్యానికి హానికరమైన వస్తువులపై అధిక పన్ను విధించాలని కేంద్రం చూస్తోంది. ఇప్పటికే ఉన్న 28% జీఎస్టీకి అదనంగా 40% ప్రత్యేక పన్ను (Sin Tax) విధించే అవకాశం ఉందని సమాచారం. దీని ద్వారా ఒకవైపు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ, మరోవైపు ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని అందించాలన్నదే లక్ష్యం.
వ్యాపారులకు ఊరట
చిన్న మరియు మధ్య తరహా వ్యాపారులకు ఈ విధానం ఊరట కలిగించనుంది. తక్కువ పన్ను రేట్ల వల్ల నిబంధనలు సరళతరం అవుతాయి. లెక్కలు నిర్వహించడంలో సులభతరం అవుతుంది. పన్ను చెల్లింపుల ప్రక్రియ గణనీయంగా సులభపడనుంది. మొత్తంగా, జీఎస్టీ విధానంలో ఈ కీలక మార్పులు అమలవుతే, అది ప్రజల ఖర్చులకు గణనీయంగా ఊరటనివ్వనుంది. దీపావళి కానుకగా కేంద్రం ఇచ్చే ఈ మార్పులు, దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహం నింపే అవకాశాలున్నాయి.