Brij Bhushans First Reaction : వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా : బ్రిజ్ భూషణ్
బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే తాను హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు రెడీ అని బ్రిజ్ భూషణ్(Brij Bhushans First Reaction) స్పష్టం చేశారు.
- By Pasha Published Date - 11:12 AM, Sat - 7 September 24

Brij Bhushans First Reaction : స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు కాంగ్రెస్ పార్టీలో చేరిన అంశంపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్, బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తొలిసారిగా స్పందించారు. రెండేళ్ల క్రితం నుంచే కాంగ్రెస్ పార్టీలో చేరాలనే ప్లాన్‌లో వాళ్లిద్దరూ ఉన్నారని ఆయన మండిపడ్డారు. ‘‘వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు కాంగ్రెస్ పార్టీలో చేరుదామని రెండేళ్ల క్రితమే డిసైడయ్యారు. నా రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసేందుకు సంబంధించిన కుట్రను రెండేళ్ల కిందట జనవరి 18న మొదలుపెట్టారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ హోదాలో ఉన్న నాపై అనవసర బురదజల్లారు. వారిద్దరిని తెర వెనుక నుంచి ఆడించింది కాంగ్రెస్ పార్టీయే. నాపై ఆరోపణలు చేసేందుకు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలకు స్క్రిప్ట్ రాసిచ్చింది కాంగ్రెస్ నేతలు దీపేందర్ హుడా, భూపిందర్ హుడా. వాళ్లిద్దరు చేసిన నిరసన కార్యక్రమాలను క్రీడాకోణంలో కాకుండా రాజకీయ కోణంలో చూడాలి. ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత వినేష్, బజరంగ్ ఆడిన డ్రామా బట్టబయలైంది’’ అని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వ్యాఖ్యానించారు. ప్రముఖ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్స్ చేశారు.
‘‘వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలకు తెర వెనుక నుంచి భూపీందర్ హుడా, దీపేందర్ హుడా, ప్రియాంకాగాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారు. వాళ్లు ఆనాడు చేసింది క్రీడాకారుల నిరసన కార్యక్రమం కాదు.. కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం అది. వినేష్ ఫోగట్ ఆడపిల్లల గౌరవం కోసం జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేశారనే భ్రమలో హర్యానా ప్రజలు ఉండొద్దని నేను కోరుతున్నాను. వారు రాజకీయం మాత్రమే చేశారు’’ అని బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పేర్కొన్నారు. “నాపై రెజ్లర్లు చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలే. ఆడపిల్లలను కూడా రాజకీయాల కోసం వాడుకున్న నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీది’’ అని ఆయన ధ్వజమెత్తారు.
ఇలాంటి రాజకీయ డ్రామాలతో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదన్నారు. బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే తాను హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు రెడీ అని బ్రిజ్ భూషణ్(Brij Bhushans First Reaction) స్పష్టం చేశారు. వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి తాను సిద్ధమన్నారు.