BJP : కంగనా చేసిన వ్యాఖ్యలకు పార్టీ బాధ్యత వహించదు: బీజేపీ
ఆమె చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ బాధ్యత వహించబోదని స్పష్టం చేసింది. పార్టీ తరపున విధానపరమైన అంశాలపై మాట్లాడే అధికారం కంగనా రనౌత్‌కు లేదని, అందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదని తెలిపింది.
- By Latha Suma Published Date - 06:30 PM, Mon - 26 August 24

Kangana Ranaut : బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలపై హైకమాండ్ స్పందించింది. రైతు నిరసనల విషయంలో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోకుంటే మన దేశంలో కూడా బంగ్లాదేశ్ లాంటి సంక్షోభం ఏర్పడవచ్చంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ బాధ్యత వహించబోదని స్పష్టం చేసింది. పార్టీ తరపున విధానపరమైన అంశాలపై మాట్లాడే అధికారం కంగనా రనౌత్‌కు లేదని, అందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదని తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటనలో బీజేపీ వివరణ ఇచ్చింది. కంగనాను సున్నితంగా మందలించిన అధిష్ఠానం వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కోరింది. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సూచించింది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, రైతుల ఆందోళనలపై బాలీవుడ్ నటి, మండి ఎంపి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అగ్రనాయకత్వం (బీజేపీ) బలంగా లేకుంటే రైతుల ఆందోళనలతో దేశంలో బంగ్లాదేశ్ పరిస్థితులు తలెత్తి ఉండేవని కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. ఆమె మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మూడు వ్యవసాయ చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేస్తుందని రైతులు ఊహించి ఉండరని అన్నారు. ఇప్పటికీ ఆందోళనల పేరుతో వారు సరిహద్దుల్లో కూర్చుంటున్నారని అన్నారు. రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న ఆందోళనల కారణంగానే మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. బంగ్లాదేశ్‌లో అరాచకం జరిగినట్లే భారత దేశంలోనూ జరిగి ఉండేది. విదేశీ శక్తులు రైతుల సాయంతో మనల్ని నాశనం చేయాలని కుట్ర పన్నాయి. మన నాయకత్వానికి దూరదృష్టి లేకుంటే వారు విజయం సాధించి ఉండేవారు అని అన్నారు.
ఈ వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీకి తలనొప్పిగా మారాయి. దీంతో కంగనా వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదంటూ ఓ ప్రకటన ఇచ్చింది. పార్టీ విధాన సమస్యలపై బీజేపీ తరపున కంగనా ప్రకటన చేసేందుకు ఎలాంటి అనుమతి లేదా అధికారం లేదని తప్పించుకునేందుకు యత్నించింది. భవిష్యత్తులో ఇటువంటి ప్రకటనలు చేయవద్దని కంగనాను ఆదేశించింది.