Maoist Ashanna : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. లొంగిపోనున్న ఆశన్న టీమ్!
Maoist Ashanna : దశాబ్దాలుగా సాయుధ పోరాటం సాగించిన నేతలు ఇప్పుడు చట్టబద్ధ జీవితానికి మళ్లడం మావోయిస్టు ప్రాంతాల్లో పెద్ద మార్పుగా భావించబడుతోంది. ప్రభుత్వ పునరావాస విధానాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు, భద్రతా హామీలు వంటి చర్యలు మావోయిస్టు
- By Sudheer Published Date - 07:27 PM, Wed - 15 October 25

మావోయిస్టు ఉద్యమంలో కీలక పరిణామాలు కొనసాగుతున్నాయి. ఇటీవల మావోయిస్టు కేంద్ర కమిటీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగుబాటు అనంతరం మరో ప్రముఖ నేత తక్కళ్లపల్లి వాసుదేవరావు కూడా లొంగిపోవడానికి సిద్ధమయ్యారని సమాచారం వెలువడింది. ములుగు జిల్లా వెంకటాపురానికి చెందిన వాసుదేవరావు అలియాస్ ఆశన్న గత నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఆయన పార్టీ సెంట్రల్ కమిటీలో కీలకస్థానం దక్కించుకున్న నేతగా గుర్తింపు పొందారు. అరణ్యప్రాంతాల అభివృద్ధి పేరుతో సాయుధ పోరాటం కొనసాగించిన ఆశన్న, గత కొంతకాలంగా పోలీసు ఒత్తిడి, అంతర్గత విభేదాలు, ఆరోగ్య సమస్యల కారణంగా సాయుధ మార్గం కొనసాగించడం కష్టమవుతోందని భావించినట్లు తెలుస్తోంది.
Custard Apple: షుగర్ పేషంట్స్ సీతాఫలం తినవచ్చా.. తినకూడదా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!
ఆశన్నతో పాటు కేంద్ర కమిటీకి చెందిన మరో కీలక విభాగమైన దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ (DKSZC)కి చెందిన సభ్యులు రాజమన్, రనితతో పాటు ఉత్తర బస్తర్, మాడ్ డివిజన్లకు చెందిన 70 మంది మావోయిస్టులు జగల్పూర్ ప్రాంతానికి చేరుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో వారు త్వరలో ప్రభుత్వ ముందుకు లొంగుబాటు చేసుకునే అవకాశం ఉన్నట్లు గోప్య వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి, మావోయిస్టు బలగాలు గత కొన్నేళ్లుగా తీవ్రంగా బలహీనమవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పోలీసులు విస్తృత ఆపరేషన్లు నిర్వహిస్తుండటంతో నాయకత్వ స్థాయిలోనే చీలికలు కనిపిస్తున్నాయి. కేంద్ర కమిటీలో వరుసగా లొంగుబాట్లు జరగడం ఉద్యమ భవిష్యత్తుపై ప్రశ్నార్థకంగా మారింది.
APMSIDC : ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రులలో కాంట్రాక్టు కి షాక్.. !
దశాబ్దాలుగా సాయుధ పోరాటం సాగించిన నేతలు ఇప్పుడు చట్టబద్ధ జీవితానికి మళ్లడం మావోయిస్టు ప్రాంతాల్లో పెద్ద మార్పుగా భావించబడుతోంది. ప్రభుత్వ పునరావాస విధానాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు, భద్రతా హామీలు వంటి చర్యలు మావోయిస్టు లొంగుబాట్లకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో శాంతి, అభివృద్ధి మార్గం వైపు ఈ పరిణామాలు దారితీస్తున్నాయని అధికారులు విశ్లేషిస్తున్నారు. ఒకప్పుడు అరణ్య ప్రాంతాల పాలకులుగా వ్యవహరించిన మావోయిస్టు కమాండర్లు, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆశ్రయించడం చరిత్రాత్మక మలుపుగా నిలవనుంది. ఆశన్న లొంగుబాటు కూడా మావోయిస్టు ఉద్యమంలో కొత్త దశకు నాంది పలికే అవకాశం ఉందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి.