Indians In Russian Army : రష్యా సైన్యంలోని భారతీయులు ఇక స్వదేశానికి.. మోడీకి పుతిన్ ఓకే
రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓ కీలక అంశంపై ప్రెసిడెంట్ పుతిన్‌ను ఒప్పించారు.
- By Pasha Published Date - 11:32 AM, Tue - 9 July 24

Indians In Russian Army : రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఓ కీలక అంశంపై ప్రెసిడెంట్ పుతిన్‌ను ఒప్పించారు. ప్రధాని మోడీ కోరిక మేరకు.. రష్యా ఆర్మీలో పనిచేస్తున్న భారతీయులను విధుల నుంచి వెంటనే రిలీవ్ చేసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు. సైనిక విధుల నుంచి రిలీవ్ చేయనున్న భారతీయులను స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు కూడా చేస్తామని మోడీకి పుతిన్ హామీ ఇచ్చారు. సోమవారం అర్ధరాత్రి మాస్కోలోని అధ్యక్ష భవనంలో పుతిన్ ఇచ్చిన విందు కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. ఈసందర్భంగా రష్యా సైన్యంలో భారతీయుల విషయాన్ని మోడీ ప్రస్తావించగా, వారిని వెనక్కి పంపుతానని పుతిన్ మాట ఇచ్చారు. ఇది భారత్ సాధించిన దౌత్య విజయమని పరిశీలకులు అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలయ్యాక.. కొందరు భారతీయులు రష్యా ఆర్మీలో చేరారు. కొందరు ఏజెంట్ల మోసం వల్లే ఇలా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. రష్యా తరఫున ఉక్రెయిన్‌తో ప్రస్తుతం వారు ఫైట్ చేస్తున్నారు. ఇలా తలపడే క్రమంలో కొందరు ఇప్పటికే చనిపోయారు. ప్రధానంగా డబ్బుపై ఆశతో కొందరు భారతీయులు రష్యా ప్రైవేటు ఆర్మీ వాగ్నర్ గ్రూపులో రిక్రూట్ అవుతున్నారు. ఇలా చేరే వారికి వాగ్నర్ గ్రూప్ అరకొర ట్రైనింగ్ ఇచ్చి.. నేరుగా డ్యూటీలోకి దింపుతోంది. అందుకే ఈవిధంగా సైనిక విధులు నిర్వహిస్తున్న భారతీయుల ప్రాణాలకు ఎక్కువ రిస్క్ ఉంటోంది. రష్యా ఆర్మీలో చేరి అసువులు బాసిన ఒకరిద్దరు భారతీయుల కుటుంబాలు ఇటీవల మీడియా ముందుకు వచ్చి గోడు వెల్లబోసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి.
Also Read :Haldirams : స్నాక్స్ దిగ్గజం ‘హల్దీరామ్స్’ను ఎవరు కొనబోతున్నారో తెలుసా ?
కొందరు ఏజెంట్లు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటూ ఊదరగొట్టారు. మన దేశానికి చెందిన ఎంతోమంది యువతను మోసం చేసి రష్యాకు పంపారు. తీరా అక్కడ చూస్తే .. రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూప్‌లో చేరికలు జరిగాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు యువత వాగ్నర్ గ్రూప్ ద్వారా రష్యా ఆర్మీ సేవల్లోకి చేరారు. ఈవిధంగా చేరిన వారిలో ఇప్పటివరకు దాదాపు ఇద్దరు భారతీయులు చనిపోయారు. వీరి మరణాలకు ప్రధాన కారణం.. సరైన సైనిక శిక్షణ లేకపోవడం. ఉద్యోగాల పేరుతో ఏజెంట్లు చేస్తున్న మోసాలు చివరికి నిరుద్యోగ యువత ప్రాణాలపైకి తెస్తున్నాయి. అకస్మాత్తుగా సైనిక విధుల నుంచి వైదొలగడానికి కూడా భారతీయ యువతకు రష్యా ఆర్మీ(Indians In Russian Army) ఛాన్స్ ఇవ్వడం లేదు. అందుకే రష్యా ఆర్మీ నుంచి భారతీయులను రిలీవ్ చేయాలని రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌ను భారత ప్రధాని మోడీ కోరాల్సి వచ్చింది. దీనికి పుతిన్(Putin) వెంటనే ఒప్పుకున్నారు.