BBC Documentary: బీబీసీ డాక్యుమెంటరీ వివాదం.. కేంద్రానికి నోటీసులు పంపిన సుప్రీం
‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ (India: The Modi Question) పేరుతో రూపొందించిన సిరీస్ ను
- Author : Maheswara Rao Nadella
Date : 03-02-2023 - 3:49 IST
Published By : Hashtagu Telugu Desk
బీబీసీ డాక్యుమెంటరీ (BBC Documentary) వివాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ (India: The Modi Question) పేరుతో రూపొందించిన సిరీస్ ను ప్రసారం చేయకుండా కేంద్రం అడ్డుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది.
కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఒరిజనల్ డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని, మూడు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్ తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ ఇటీవల రూపొందించిన డాక్యుమెంటరీ (BBC Documentary) దేశ విదేశాల్లో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ డాక్యుమెంటరీని, ఇందుకు సంబంధించిన లింకులను భారత్‌లో కేంద్రం బ్లాక్ చేసింది.
ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సీనియర్ జర్నలిస్ట్ ఎన్.రామ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తదితరులు పిటిషన్లు వేశారు. వీటిపై విచారణ సందర్భంగానే కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది.
Also Read: Kiran Abbavaram: ఇంత పెద్ద బ్యానర్లో ఇంత త్వరగా అవకాశం