Anti Naxal Operation : 31 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్.. ఛత్తీస్‌గఢ్ సీఎంతో మాట్లాడిన అమిత్‌షా
మావోయిస్టుల ఏరివేత మిషన్ విషయంలో నిబద్ధతతో వ్యవహరిస్తున్నందుకు ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయిని(Anti Naxal Operation) అభినందించారు.
- By Pasha Published Date - 01:26 PM, Sat - 5 October 24

Anti Naxal Operation : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్ నిరంతరాయంగా జరుగుతోంది. తాజాగా అబూజ్‌మడ్‌లో 31 మంది మావోయిస్టులను కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈనేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయితో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిపై ఆయన సమీక్షించారు. ఎన్‌కౌంటర్ జరిగిన తీరు గురించి ఈసందర్భంగా అమిత్‌షాకు సీఎం విష్ణు దేవ్ సాయి వివరించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టులను పూర్తిగా ఏరివేసే దాకా ఇదే వ్యూహంతో ముందుకు సాగాలని సీఎంకు కేంద్ర హోం మంత్రి సూచించారు. మావోయిస్టుల ఏరివేత మిషన్ విషయంలో నిబద్ధతతో వ్యవహరిస్తున్నందుకు ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయిని(Anti Naxal Operation) అభినందించారు. 31 మంది మావోయిస్టులను ఎన్‌కౌంటర్ చేసిన ఆపరేషన్‌లో పాల్గొన్న రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాల సిబ్బందిని అమిత్‌షా ప్రశంసించారు.
Also Read :Savarkar : వీర సావర్కర్‌పై వ్యాఖ్యలు.. రాహుల్‌గాంధీకి పూణే కోర్టు సమన్లు
ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌లో ఉన్న నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాంతం మాద్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. అక్కడ 31 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. గత కొన్నేళ్లలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఒకేసారి ఇంత పెద్దసంఖ్యలో మావోయిస్టులు చనిపోవడం ఇదే తొలిసారి. సంఘటనా స్థలం నుంచి ఎల్ఎంజీలు, ఏకే 47 తుపాకులు, ఇన్సాస్ రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి పెద్దసంఖ్యలో భద్రతా బలగాలను పంపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అంటున్నారు. మొత్తం 31 మంది మావోయిస్టులను హతమార్చిన విషయాన్ని బస్తర్ ఐజీ పి.సుందర్‌రాజ్ ధృవీకరించారు. మావోయిస్టులు అత్యాధునిక ఆయుధాలను వాడుతున్నట్లు తాము గుర్తించామన్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే అంశమన్నారు. బహుశా పోలీసులపై భారీ దాడి కోసమే మావోయిస్టులు అత్యాధునిక ఆయుధాలను తెప్పించి ఉండొచ్చని బస్తర్ ఐజీ తెలిపారు. ‘‘మాద్ ఏరియా అడవులు చాలా దట్టంగా ఉంటాయి. వాటి మధ్యలో మావోయిస్టులను ట్రేస్ చేసి కాల్పులు జరపడం చాలా కఠినమైన అంశం. అయినా ఈవిషయంలో భద్రతా బలగాలు సక్సెస్ అయ్యాయి’’’ అని ఐజీ వివరించారు.