Waqf Amendment Bill : టీడీపీ ప్రతిపాదించిన సవరణలకు ఆమోదం
Waqf Amendment Bill : తెలుగుదేశం పార్టీ (TDP) ప్రతిపాదించిన నాలుగు సవరణల్లో మూడు ఆమోదం పొందడం గమనార్హం. ముఖ్యంగా 'వక్ఫ్ బై యూజర్'గా నమోదైన ఆస్తుల పునఃపరిశీలనకు అవకాశం ఉండకూడదని
- By Sudheer Published Date - 10:43 PM, Tue - 1 April 25

వక్ఫ్ బోర్డు చట్ట (Waqf Amendment Bill) సవరణ బిల్లు రేపు లోక్ సభ (Lok Sabha) ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ తమ ఎంపీలకు విప్ జారీచేశాయి. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, వినియోగం, మరియు వాటిపై వివాదాలు నివారించే విధంగా చట్ట సవరణలు ఉండనున్నాయి. తెలుగుదేశం పార్టీ (TDP) ప్రతిపాదించిన నాలుగు సవరణల్లో మూడు ఆమోదం పొందడం గమనార్హం. ముఖ్యంగా ‘వక్ఫ్ బై యూజర్’గా నమోదైన ఆస్తుల పునఃపరిశీలనకు అవకాశం ఉండకూడదని, ఒకసారి వక్ఫ్ ఆస్తిగా నమోదయితే, దానిని తిరిగి అన్వేషించకూడదనే సవరణ ఆమోదించబడింది. అలాగే కలెక్టర్‌కు తుది అధికారం లేకపోవడం, డిజిటల్‌గా పత్రాలను సమర్పించేందుకు మరింత సమయం ఇచ్చే నిర్ణయం తీసుకోవడం వంటి అంశాలు చట్టంలో మార్పులుగా అంగీకరించబడ్డాయి.
Chandrababu : బాబు మీటింగ్ లో జగన్ నినాదాలు
అయితే టీడీపీ ప్రతిపాదించిన నాలుగో సవరణకు మద్దతు లభించలేదు. ఈ సవరణ ప్రకారం.. వక్ఫ్ ఆస్తులపై ముస్లిమేతరుల జోక్యాన్ని నివారించాలన్న ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది. టీడీపీ సవరణ ప్రకారం హిం దేవాలయాల పరిపాలనలో ఇతర మతస్తుల జోక్యాన్ని అనుమతించనట్లే, ముస్లిం మత వ్యవహారాల్లో కూడా ముస్లిమేతరుల జోక్యాన్ని అనుమతించకూడదని స్పష్టం చేసింది. అయితే కేంద్రం మరియు మిగతా పార్టీలు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశాయి.
ఇక టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రేమ్ కుమార్ జైన్ తెలిపిన దాని ప్రకారం.. పార్టీ వక్ఫ్ (సవరణ) బిల్లుకు మద్దతు ఇస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం సమాజానికి అనుకూలంగా ఉన్నారని తెలిపారు. ఏప్రిల్ 4వ తేదీతో బడ్జెట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. ముస్లిం సమాజం మొత్తం ఈ బిల్లును ఆసక్తిగా ఎదురుచూస్తోందని, టీడీపీ దీని అనుకూలంగా ఓటు వేస్తుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ మాట్లాడుతూ.. ఈ బిల్లును వ్యతిరేకించనున్నట్లు ప్రకటించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) ఎదుట తమ అభ్యంతరాలను కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేసినప్పటికీ, అవి ఆమోదించబడలేదని ఆయన తెలిపారు.
ఇక బిజెపి జాతీయ అధికార ప్రతినిధి సిఆర్ కేశవన్.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ విషప్రచారం చేస్తోందని, ప్రియాంక గాంధీ వాద్రా తన పార్టీని సముదాయించి, దీని పట్ల మద్దతు తెలిపేలా చూడాలని సూచించారు. వక్ఫ్ (సవరణ) బిల్లు, ‘యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫిషియెన్సీ, అండ్ డెవలప్‌మెంట్ (UMEED) బిల్లు’గా పిలువబడుతోంది. దీని ముఖ్య ఉద్దేశం వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, డిజిటలైజేషన్, మెరుగైన ఆడిటింగ్, పారదర్శకత పెంపు, మరియు అక్రమ ఆక్రమణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే. 1995లో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్టంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఈ సవరణల ద్వారా ముస్లిం సమాజానికి ప్రయోజనం కలుగుతుందని బిజెపి స్పష్టం చేసింది.