Baba Siddique : దారుణ హత్యకు గురైన బాబా సిద్దీఖ్ ఎవరు ?
ఎందుకంటే ఆ ఇఫ్తార్ పార్టీలకు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ (Baba Siddique) వంటి టాప్ బాలీవుడ్ స్టార్లు హాజరవుతుంటారు.
- By Pasha Published Date - 09:26 AM, Sun - 13 October 24

Baba Siddique : బాబా సిద్దీఖ్ (66).. ఈయన మహారాష్ట్ర మాజీ మంత్రి. శనివారం రోజు ముంబైలో బాబా సిద్దీఖ్ దారుణ హత్య జరిగింది. ముంబైలోని తన కుమారుడు జీషాన్ ఆఫీసు వద్దకు చేరుకోగానే ఆయనపై నలుగురు దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఆయన శరీరంలోకి ఆరు బుల్లెట్లు దూసుకెళ్లాయి. నాలుగు బుల్లెట్లు ఛాతీలోకి చొచ్చుకుపోయాయి. నగరంలోని లీలావతి ఆస్పత్రికి తరలించేలోపే బాబా సిద్దీఖ్ చనిపోయారు. రంజాన్ మాసంలో ముంబై నగరంలో బాబా సిద్దీఖ్ ఇచ్చే ఇఫ్తార్ పార్టీలు చాలా ఫేమస్. ఎందుకంటే ఆ ఇఫ్తార్ పార్టీలకు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ (Baba Siddique) వంటి టాప్ బాలీవుడ్ స్టార్లు హాజరవుతుంటారు. షారుఖ్, సల్మాన్‌లకు బాబా సిద్దీఖ్ చాలా క్లోజ్ అని చెబుతుంటారు. కొన్ని నెలల క్రితమే నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వెలుపల కాల్పులు జరిగాయి. ఇంతలోనే వారికి సన్నిహితంగా మెలిగే బాబా సిద్దీఖ్ హత్య జరగడం ముంబైలో కలకలం రేపింది. వాస్తవానికి 15 రోజుల క్రితమే సిద్దీఖ్‌కు హత్య బెదిరింపు వచ్చింది. ఈవిషయాన్ని ఆయన పోలీసులకు తెలియజేశారు. దీంతో ఆయనకు ‘వై’ కేటగిరీ భద్రతను కల్పించారు.
Also Read :Professor Saibaba: హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
- బాబా సిద్దీఖ్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌లో మొదలైనప్పటికీ.. ప్రస్తుతం ఆయన అజిత్ పవార్ వర్గం ఎన్‌సీపీలో ఉన్నారు.
- బాబా సిద్దీఖ్ కుమారుడు జీషాన్ కూడా రాజకీయాల్లో ఉన్నారు.
- జీషాన్ ముంబైలోని బాంద్రా ఈస్ట్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ ఏడాది ఆగస్టులోనే జీషాన్‌పై కాంగ్రెస్ బహిష్కరణ వేటు వేసింది.
- వాస్తవానికి బాబా సిద్దీఖ్ బిహార్ వాస్తవ్యుడు.
- తొలుత ఆయన కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో చేరి కార్యకర్తగా పనిచేశారు.
- కాంగ్రెస్‌లో రాజకీయంగా యాక్టివ్ అయిన తర్వాత ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సిద్దీఖ్ పోటీ చేశారు. మున్సిపల్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.
- తదుపరిగా కాంగ్రెస్ పార్టీ సిద్దీఖ్‌కు వాండ్రే వెస్ట్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించింది. 1999, 2004, 2009లలో వరుసగా మూడు సార్లు ఆ సీటును ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. అప్పట్లో ఆహార పౌర సరఫరాలు, కార్మిక మంత్రిగా పనిచేశారు.
- ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బాబా సిద్దీఖ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి వైదొలిగేటప్పుడు బాబా సిద్దీఖ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “కాంగ్రెస్‌లో నన్ను కరివేపాకులా వాడారు. ఆహారంలో రుచి కోసం కరివేపాకును వాడుతారు. అలాగే నన్ను వాడుకొని వదిలేశారు’’ అని ఆయన చెప్పారు.