Darshan : నటుడు దర్శన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. హత్య కేసులో బెయిల్ రద్దు
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఈ కేసుకు మరింత ప్రాధాన్యం చేకూర్చాయి. నిందితుడు ప్రముఖ నటుడు కావచ్చునేమో గానీ, చట్టం ముందు అందరూ సమానమే. బెయిల్ మంజూరు చేయడానికి సరైన చట్టపరమైన కారణాలు లేవు అని స్పష్టం చేశారు.
- By Latha Suma Published Date - 11:57 AM, Thu - 14 August 25

Darshan : రేణుకాస్వామి హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌కు సుప్రీం కోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును సుప్రీం కోర్టు గురువారం రద్దు చేసింది. దీంతో ఈ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. జస్టిస్ జెబీ పార్దివాలా మరియు జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. బెయిల్ ఇచ్చిన తీర్పును పక్కన పెట్టుతూ, నిందితుడికి తక్షణంగా కస్టడీకి తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఈ కేసుకు మరింత ప్రాధాన్యం చేకూర్చాయి. నిందితుడు ప్రముఖ నటుడు కావచ్చునేమో గానీ, చట్టం ముందు అందరూ సమానమే. బెయిల్ మంజూరు చేయడానికి సరైన చట్టపరమైన కారణాలు లేవు అని స్పష్టం చేశారు.
Read Also: HDFC : హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాలకు కొత్త నిబంధనలు..ఆగస్టు 1 నుంచి అమలు..!
జస్టిస్ మహాదేవన్ మాట్లాడుతూ..ఈ కేసులో నిందితుడు బయటకు వస్తే, సాక్షులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. విచారణ పద్ధతికి ఇది విఘాతం కలిగిస్తుంది” అని పేర్కొన్నారు. అలాగే కస్టడీలో ఉన్న నిందితులకు ప్రత్యేక ట్రీట్‌మెంట్ అవసరం లేదు. జైళ్లలో ఫైవ్‌స్టార్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు మా దృష్టికి వస్తే, సంబంధిత జైలు సూపరింటెండెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. రేణుకాస్వామి హత్య కేసు కర్ణాటకలో పెద్ద సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దివంగత యువకుడు దర్శన్ అభిమానిగా ఉండగా, కొన్ని వ్యక్తిగత కారణాల నేపథ్యంలో అతడిని చిత్రహింసలకు గురిచేసినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో రేణుకాస్వామిని దారుణంగా కొట్టినట్లు, కరెంట్ షాక్ కూడా పెట్టినట్లు స్పష్టం అయింది. ఈ సమాచారం పోస్టుమార్టం నివేదిక ద్వారానే వెలుగులోకి వచ్చింది.
ఈ కేసులో దర్శన్‌తో పాటు అతడి స్నేహితురాలు పవిత్ర గౌడ, మరికొంతమంది కలిపి మొత్తం 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శన్‌ను మొదట తాత్కాలికంగా అక్టోబర్ 2024లో హైకోర్టు బెయిల్‌పై విడుదల చేయగా, డిసెంబర్ 13న రెగ్యులర్ బెయిల్ మంజూరు అయింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేయడంతో, తాజాగా సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును రద్దు చేసింది. ఈ తీర్పుతో రేణుకాస్వామి కుటుంబ సభ్యులు, సామాన్య ప్రజానీకం ధైర్యంగా ఉన్నారు. న్యాయం జరిగే అవకాశాలు మరింత మెరుగయ్యాయని భావిస్తున్నారు. కేసు విచారణ వేగంగా జరుగుతుందన్న నమ్మకంతో ఈ తీర్పును ప్రజలు స్వాగతిస్తున్నారు.