Deepfake Deadline : వారం డెడ్‌లైన్.. ‘డీప్‌ఫేక్’ కంటెంట్‌పై కొరడా : కేంద్రం
Deepfake Deadline : డీప్‌ఫేక్ వీడియోల అలజడికి అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
- By Pasha Published Date - 03:57 PM, Fri - 24 November 23

Deepfake Deadline : డీప్‌ఫేక్ వీడియోల అలజడికి అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. డీప్‌ఫేక్ కంటెంట్‌ను నియంత్రించేందుకు, పర్యవేక్షించేందుకు ఓ అధికారిని నియమిస్తామని కేంద్ర ఐటీశాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. దీనికి సంబంధించిన విధివిధానాలు, తీసుకునే చర్యల వివరాలతో ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందిస్తామని చెప్పారు. డీప్‌ఫేక్ కంటెంట్‌తో ఐటీ నిబంధనలను ఉల్లంఘించే సోషల్ మీడియా సంస్థలపై యూజర్స్ నుంచి ఫిర్యాదులను ఈ వెబ్‌సైట్ ద్వారా స్వీకరిస్తామని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
డీప్ ఫేక్‌లను తయారు చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేలా పౌరులకు ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తుందని రాజీవ్ చంద్రశేఖర్ తేల్చి చెప్పారు. శుక్రవారం సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో భేటీ అనంతరం ఆయన ఈవివరాలను వెల్లడించారు. ఈరోజు నుంచి ఐటీ నిబంధనల ఉల్లంఘనలను ఉపేక్షించేది లేదని ప్రకటించారు. ఎవరి నుంచైనా డీప్ ఫేక్ వీడియోలపై కంప్లయింట్ వస్తే తొలుత సోషల్ మీడియా సంస్థలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామన్నారు. ఒకవేళ సోషల్ మీడియా సంస్థ కంటెంట్ సోర్స్ వివరాలిస్తే నేరుగా బాధ్యులపై కేసు నమోదయ్యేలా చర్యలు తీసుకుంటామని రాజీవ్ చంద్రశేఖర్ వివరించారు. డీప్‌ఫేక్ కంటెంట్‌ను అరికట్టేలా సోషల్ మీడియా సంస్థలు తమ ‘టర్మ్స్ ఆఫ్ యూజ్’ను ఐటీ నిబంధనలకు అనుగుణంగా మార్చాలని ఆదేశించారు. ఇందుకు వారం రోజుల గడువు ఇస్తున్నట్లు(Deepfake Deadline) తెలిపారు.