Prahlad Joshi : ఉక్రెయిన్ లోని విద్యార్థులపై కేంద్ర మంత్రి నిందలు
ఉక్రెయిన్, రష్యా యుద్ధం జరుగుతోన్న వేళ విదేశాల్లో ఎంబీబీఎస్ చదవడానికి వెళ్లిన విద్యార్థుల ప్రతిభను కించపరుస్తూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
- By CS Rao Published Date - 02:30 PM, Wed - 2 March 22

ఉక్రెయిన్, రష్యా యుద్ధం జరుగుతోన్న వేళ విదేశాల్లో ఎంబీబీఎస్ చదవడానికి వెళ్లిన విద్యార్థుల ప్రతిభను కించపరుస్తూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వివిధ దేశాల్లో చదువుతున్న 90% భారతీయ విద్యార్థులు భారత దేశం నిర్వహించే FMGE పరీక్షలో ఫెయిల్ అవుతున్నారని వెల్లడించాడు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రోగ్రెసివ్ మెడికోస్ అండ్ సైంటిస్ట్స్ ఫోరమ్ (PMSF) తీవ్రంగా స్పందించింది. ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితుల్లో ఉన్న విద్యార్థుల పట్ల అనుచితమైన వ్యాఖ్యలను చేయడం మానుకోవాలని PMSF హితవు పలికింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ ఉక్రెయిన్లోని విద్యార్థులను ఎలా సురక్షితంగా తీసుకురావాలో ఆలోచించాలని కోరింది. భయానకత పరిస్థితుల్లో విదేశాల్లో మెడికల్ విద్యను అభ్యసించడానికి వెళ్లిన వాళ్లపై నిందలు వేయొద్దని PMSF విజ్ఞప్తి చేసింది.విదేశాల్లో మెడికల్ విద్యను అభ్యసించిన విద్యార్థులు భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ కోసం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ (FMGE) క్లియర్ చేయాల్సి ఉంటుంది. FMGEని ఇప్పుడు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (NExT) ద్వారా భర్తీ చేయాలని ప్రతిపాదించబడింది, ఈ పరీక్ష భారతదేశంలో చదివిన MBBS విద్యార్థులకు అర్హత సాధించే చివరి పరీక్షగా మారుతుంది. బహుశా NEET-PG పరీక్షను భర్తీ చేసే అవకాశం ఉంది. భారత దేశంలో ఖరీదైన వైద్యవిద్యను సామాన్యులు భరించలేకపోతున్నారు. ప్రత్యామ్నాయంగా వైద్యులు కావడానికి విదేశాలకు భారతీయ విద్యార్థులు వెళుతున్నారు. భారతదేశంలో పరిమిత ప్రభుత్వ MBBS సీట్లు ఉన్నాయి. చాలా ప్రైవేటు కళాశాల్లో నాణ్యమైన వైద్య విద్య లభించడంలేదు. పలితంగా వేలాది మంది ఔత్సాహికులు MBBS కోసం యూరప్‌లోని వైద్య కళాశాలల్లో చేరడానికి వెళుతున్నారు. అడ్మిషన్లను ఏర్పాటు చేసే ఏజెన్సీల నుండి సహాయం కోరవలసి వస్తుంది.
"विदेश जाने वाले 90% स्टूडेंट्स भारत में मेडिकल की प्रवेश परीक्षा NEET में ही Fail हो जाते हैं"
केंद्रीय मंत्री प्रह्लाद जोशी#UkraineRussiaWar #IndiansInUkraine pic.twitter.com/3yRQzFwzh7
— News24 (@news24tvchannel) March 1, 2022
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన ఆదేశం ప్రకారం ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక డాక్టర్ ఉండాలి. ఆ మేరకు వైద్య విద్య కోసం ఏర్పాట్లు చేయాలని భారత్ కు నివేదించింది. ఆ లక్ష్యానికి బహుదూరంగా భారత దేశం ఉంది. గత ఏడాది (2021లో) 8.70 లక్షల మంది అభ్యర్థులు NEET-UG క్లియర్ చేశారు. కానీ, వాళ్లకు కేవలం 88,120 అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు మాత్రమే కళాశాల్లో ఉన్నాయి. అంటే, ఇంకా 7లక్షల 90వేల మంది ఎంబీబీఎస్ చదువుకోవాలనే ఉత్సాహం ఉన్న విద్యార్థులకు దేశంలో అవకాశం లేదు. అందుకే, జార్జియా, ఫిలిప్పీన్స్, చైనా, రష్యా వంటి దేశాలకు భారత విద్యార్థులు వెళుతున్నారు. ఆ విషయాన్ని ఫిబ్రవరి 26న ప్రధాని నరేంద్ర మోదీ ఆరోగ్య రంగంలో కేంద్ర బడ్జెట్ ప్రకటనలపై వెబ్‌నార్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రస్తావించారు. వైద్య విద్య రంగంలో ప్రైవేట్ రంగం పెద్దఎత్తున ప్రవేశించాలని పిలుపునిచ్చాడు. ఐరోపా దేశాలకు భారతీయ విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఎంబీబీఎస్ చదువు కోసం వెళుతున్నారు. ఆయా దేశాల్లో భారతీయ విద్యార్థులు వెళ్లే దేశాల్లో నాలుగో స్థానంలో ఉక్రెయిన్ ఉంది. విదేశీ విద్యార్థులలో 24% మంది భారతదేశానికి చెందినవారని మంత్రిత్వ శాఖ డేటా చెబుతోంది. ఉక్రెయిన్, చైనా నుండి తిరిగి వచ్చిన వేలాది మంది అనిశ్చిత భవిష్యత్తుతో ఉన్నారు.
భారతదేశంలోని 284 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 43,310 MBBS సీట్లు ఉండగా 269 ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 41,065 MBBS సీట్లు అందుబాటులో ఉన్నాయని జాతీయ వైద్య కమిషన్ వెబ్‌సైట్ నిర్థారిస్తోంది. ప్రభుత్వ కాలేజిలు మినహా మిగిలిన భారతీయ ప్రైవేటు మెడికల్ కాలేజిల్లో చదువు కోట్లాది రూపాయాలకు అమ్ముకుంటున్నారు. అదే, ఉక్రెయిన్ , రష్యా వంటి దేశాలలో భారత్ లోని ప్రైవేటు కాలేజిల కంటే మూడో వంత ఖర్చుతో MBBS డిగ్రీ పొందడానికి అవకాశం ఉంది. భారతదేశంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో డోనేషన్ కాకుండా సంవత్సరానికి రూ. 10 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. మొత్తంగా 4కోట్ల రూపాయాల వరకు సగటున ఎంబీబీఎస్ విద్యార్థికి భారత్ లోని ప్రైవేటు కాలేజిల్లో ఖర్చు అవుతోంది. అదే విదేశాల్లో అయితే, రూ. 3 నుంచి రూ. 4 లక్షలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంతేకాకుండా, కొన్ని భారతీయ ప్రైవేట్ కళాశాలల్లో విద్య నాశిరకంగా ఉంటోంది.ప్రైవేటు రంగాన్ని మెడికల్ కాలేజిల్లో ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోడీ చె్బుతున్నప్పటికీ ప్రైవేటు కాలేజీలపై సరైన నియంత్రణ ప్రశ్నార్థకంగా మారింది. “ప్రైవేట్ కాలేజీల మేనేజ్‌మెంట్‌లు ఎంబీబీఎస్ చదవును వ్యాపారంలా నడుపుతూ నాశిరకమైన విద్యనను అందిస్తున్నారు. మేనేజ్‌మెంట్ కోటా సీట్లు చాలా ఖరీదైనవి కావడంతో బంగ్లాదేశ్‌తో సహా చాలా దేశాలు భారత విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం, భారతీయ రాష్ట్రాలలో వైద్య కళాశాలల సంఖ్య చాలా అసమానంగా ఉంది. ఎక్కువ సంఖ్యలో కర్ణాటకలో కేంద్రీకృతమై ఉన్నాయి . ఆ రాష్ట్రంలో NMC ప్రకారం 9,795 MBBS సీట్లతో 63 కళాశాలలు ఉన్నాయి. అదే మహారాష్ట్ర (61 కళాశాలలు మరియు 9,600 MBBS సీట్లు), తమిళనాడు (69 కళాశాలలు మరియు 10625 MBBS సీట్లు), తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ (34 కళాశాలలు మరియు 5,340 సీట్లు; మరియు 31 కళాశాలలు మరియు 5,210 సీట్లు వరుసగా), మరియు ఉత్తర ప్రదేశ్ (67 కళాశాలలు మరియు 8,678 సీట్లు) ఉన్నాయి. వాస్తవాలకు భిన్నంగా NITI ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ కె పాల్ మాత్రం 2024 నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించిన 1:1000 డాక్టర్ పేషెంట్ నిష్పత్తిని సాధించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని చెబుతున్నాడు.
=జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసి) ఎంబిబిఎస్ సీట్ల కొరతను సీరియస్‌గా తీసుకుంటే, ప్రతి రాష్ట్ర జనాభా నిష్పత్తి ప్రకారం, కనీసం ప్రతి సంవత్సరం దాదాపు 30,000 MBBS సీట్లను జోడించాలి. అందుకోసం నిధులను భారీగా విడుదల చేయాలి. అలా చేయకపోతే, విదేశాలకు విద్యార్థులు వెళ్లడాన్ని ఎవరూ ఆపలేరు. ఇలాంటి వాస్తవాలను గమనించకుండా కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి విదేశీ వైద్య విద్యార్థులపై ప్రత్యేకించి ఉక్రెయిన్లోని విద్యార్థులపై నోరుపారేసుకున్నాడు. దేశంలోని ప్రైవేటు వైద్య విద్యా సంస్థల లాబీయింగ్ తో విదేశీ విద్యను అభ్యసించిన వాళ్లపై FMGE రూపంలో కత్తి పెడుతున్నారు. ఉద్దేశ పూర్వకంగా ఎక్కువ మంది ఆ పరీక్ష పాస్ కాకుండా ప్రతి ఏడాది కుట్ర పన్నుతున్నారు. అందుకే వాళ్ల ఉత్తీర్ణత శాతం 15 కంటే మించడంలేదు. దాని వెనుక భారత్ లోని ప్రైవేటు విద్యా సంస్థలు, ఎన్ ఎంసీ కలిసి చేస్తోన్న కుట్ర ఉందని తరచూ వినిపించే ఆరోపణలు. ఆ కుట్రను కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి గమనించాలని విదేశీ విద్యార్థులు కోరుకుంటున్నారు. సో..కేంద్ర మంత్రి ఉక్రెయిన్ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యల దూమారం ఎన్ ఎంసీ ని ఛాలెంజ్ చేస్తోంది.