Manipur Violence : మణిపూర్‌లో హింసాత్మక ఘర్షణలకు స్వస్తి పలికేలా శాంతి కమిటి..
జూన్1న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) మణిపూర్‌లో పర్యటించారు. స్థానిక అధికారులు, నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా మణిపూర్ గవర్నర్(Governer) అనసూయా ఉయికే ఆధ్వర్యంలో శాంతి కమిటీ వేస్తామని తెలిపారు.
- Author : News Desk
Date : 10-06-2023 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు(Manipur Violence) చోటు చేసుకుంటూనే ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం భద్రత సిబ్బంది వేషదారణలో వచ్చిన కొందరు వ్యక్తులు కాల్పులు జరపడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మే10 నుంచి మణిపూర్‌లోని రెండు తెగల మధ్య ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో 100మందికిపైగా మరణించారు. జూన్1న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) మణిపూర్‌లో పర్యటించారు. స్థానిక అధికారులు, నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా మణిపూర్ గవర్నర్(Governer) అనసూయా ఉయికే ఆధ్వర్యంలో శాంతి కమిటీ వేస్తామని తెలిపారు. ఈ కమిటీలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు, కుకీ, మైతేయ్ కమ్యూనిటీలకు చెందిన ప్రతినిధులు, సామాజిక సంస్థల ప్రతినిధులు ఉంటారని అమిత్ షా ప్రకటించారు. మణిపూర్‌లో కొనసాగుతున్న సంక్షోభానికి స్వస్తి చెప్పాలంటే చర్చలే మార్గమని అమిత్ షా స్పష్టం చేశారు.
అమిత్ షా పేర్కొన్నట్లుగా శనివారం మణిపూర్‌లో గవర్నర్ అనసూయా ఉయికే అధ్యక్షతన శాంతి కమిటీని కేంద్రం హోంశాఖ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ముఖ్యమంత్రి, కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాసంఘాల నేతలు సభ్యులుంటా ఉంటారని పేర్కొంది. జాతుల మధ్య శాంతి స్థాపన ప్రక్రియను సులభతరం చేసేందుకు, వారి మధ్య చర్చల నిర్వహణకు ఈ కమిటీ చొరవ తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) హోదా కోసం మైతేయి కమ్యూనిటీ డిమాండ్‌కు నిరసనగా మే3న కొండ జిల్లాల్లో గిరిజన సంఘీబావం యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ తరువాత నుంచి మణిపూర్‌లో రెండు కమ్యూనిటీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 100మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 300మందికిపైగా గాయపడ్డారు. జూన్9న సీబీఐ ఆరు మణిపూర్ హింస కేసులను స్వాధీనం చేసుకుంది. డీఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. గత నెలలో ఈశాన్య రాష్ట్రంలో హింసాత్మక ఘర్షణలు చెలరేగడంతో ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.