Bhagat Singh: భగత్ సింగ్ కు నివాళులర్పించిన ప్రధాని మోదీ
గురువారం (28 సెప్టెంబర్ 2023) భగత్ సింగ్ (Bhagat Singh) జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆయనకు నివాళులర్పించారు.
- By Gopichand Published Date - 12:00 PM, Thu - 28 September 23

Bhagat Singh: గురువారం (28 సెప్టెంబర్ 2023) భగత్ సింగ్ (Bhagat Singh) జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయం, స్వేచ్ఛ కోసం భారతదేశం నిరంతర పోరాటానికి అమరవీరుడు భగత్ సింగ్ ఎల్లప్పుడూ చిహ్నంగా ఉంటాడు. ప్రధాని మోదీ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ.. ‘షాహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాను. భారతదేశ స్వాతంత్య్రం కోసం అతని త్యాగం, అచంచలమైన అంకితభావం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. ధైర్యానికి ప్రతిరూపంగా న్యాయం, స్వేచ్ఛ కోసం భారతదేశం నిరంతర పోరాటానికి అతను ఎల్లప్పుడూ చిహ్నంగా ఉంటాడని పేర్కొన్నారు.
Remembering Shaheed Bhagat Singh on his birth anniversary. His sacrifice and unwavering dedication to the cause of India’s freedom continue to inspire generations. A beacon of courage, he will forever be a symbol of India's relentless fight for justice and liberty. pic.twitter.com/cCoCT8qE43
— Narendra Modi (@narendramodi) September 28, 2023
భగత్ సింగ్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పంజాబ్ ప్రాంతంలోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో 1907, సెప్టెంబరు 28న జన్మించాడు. అతని తల్లిదండ్రులు కిషన్ సింగ్, విద్యావతి. భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్ స్వామి దయానంద సరస్వతికి అనుచరుడు. ఆయన ప్రభావం భగత్‌పై బాగా ఉండేది. పదమూడేళ్ల ప్రాయంలో మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమం కూడా భగత్‌పై విపరీత ప్రభావం చూపింది. గాంధీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రత్యక్షంగా మొదటిసారి పాల్గొన్నాడు. ప్రభుత్వ పుస్తకాలను, విదేశీ దుస్తులను తగులబెట్టాడు.
Also Read: MLA Kotamreddy : వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బాబు అరెస్ట్‌పై వైసీపీలో..?
యుక్త వయసుకు వచ్చాక ఆయనకి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా, నా జీవితం దేశానికి అంకితం చేయాలనుకుంటున్నాను. నాకు ఇంకే కోరిక లేదని ఉత్తరం రాసి ఇంటి నుండి పారిపోయాడు. అలా ఇంటి నుంచి పారిపోయి నవ జవాన్ భారత సభ అనే సంఘంలో చేరాడు. ఆ సంఘం ద్వారా యువకులను ఆకర్షించి స్వాతంత్య్రోద్యమ సాధనకు పురికొల్పాడు. అనంతరం హిందూస్థాన్ గణతంత్ర సంఘంలోనూ చేరాడు. అక్కడే అతనికి సుఖ్‌దేవ్ పరిచయమయ్యాడు. ఇద్దరు అనతి కాలంలోనే ఆ సంఘానికి నాయకులయ్యారు.
బ్రిటిష్ ప్రభుత్వంపై హింసాత్మక ఉద్యమానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా దేశంలో సైమన్ గో బ్యాక్ ఉద్యమాన్ని స్వాతంత్య్ర ఉద్యమకారులు తీవ్రంగా అడ్డుకున్నారు. అందులో భాగంగా లాహోర్‌లో లాలా లజపతి రాయ్ బ్రిటిష్ సాయుధ బలగాలను ఎదురొడ్డి నిలిచారు. సూపరింటెండెంట్ సాండర్స్ లాఠీతో లాలా లజపతిరాయ్‌పై విరుచుకుపడ్డాడు. తల పగలగొట్టాడు, ఛాతీపైనా గాయమైంది. దీంతో పంజాబ్ కేసరి నేల కొరిగాడు. ఆయన మరణం భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్‌గురులలో ఆగ్రహాన్ని నింపింది. ఆ తర్వాత సాండర్స్‌ను కసి తీరా కాల్చి చంపారు. ఆ హత్యకు కారణమైన వారిని ఉరితీయాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత 1929లో పార్లమెంటులోపై బాంబులు విసిరారు. అనంతరం ముగ్గురు లొంగిపోతే వారిపై బ్రిటిష్ ప్రభుత్వం సాండర్స్ హత్యా నేరం మోపింది. కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. ఉరి కొయ్యని ముద్దాడే ముందు భగత్ సింగ్ చివరిసారి ఇచ్చిన నినాదం ఇంక్విలాబ్ జిందాబాద్.. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఆ ముగ్గురు యోధులు ఉరి కొయ్యకు వేలాడారు.