5000 Cyber Commandos: సైబర్ క్రైమ్స్ కట్టడికి 5వేల సైబర్ కమాండోలు : హోంమంత్రి అమిత్‌షా
ఆ ఆర్థిక లావాదేవీలను సురక్షితంగా మార్చేందుకు సైబర్ కమాండోలు(5000 Cyber Commandos) సహాయం చేస్తారని అమిత్ షా చెప్పారు.
- By Pasha Published Date - 02:29 PM, Tue - 10 September 24

5000 Cyber Commandos: దేశంలో సైబర్ క్రైమ్స్ భారీగా పెరుగుతూపోతున్నాయి. ఈతరుణంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు వచ్చే ఐదేళ్లలో 5వేల సైబర్ కమాండోలకు ట్రైనింగ్ ఇచ్చి అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఢిల్లీలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14C) తొలి ఆవిర్భావ దినోత్సవంలో అమిత్‌షా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో జరుగుతున్న ఆర్థిక లావాదేవీల్లో 46 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయన్నారు.
Also Read :Sitaram Yechury Condition Critical : సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమం
ఆ ఆర్థిక లావాదేవీలను సురక్షితంగా మార్చేందుకు సైబర్ కమాండోలు(5000 Cyber Commandos) సహాయం చేస్తారని అమిత్ షా చెప్పారు. భారతదేశంలోని సైబర్ వ్యవస్థను సురక్షితంగా మార్చడమే లక్ష్యంగా సైబర్ కమాండోల వ్యవస్థ పనిచేస్తుందన్నారు. సైబర్ నేరాలను అరికట్టాలనే పూర్తి నిబద్ధతతో కేంద్ర ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. సైబర్ సెక్యూరిటీ అనేది మానవత్వానికి ఓ సాంకేతికత వరం లాంటిదన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసు వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థలు, ఆర్థిక సంస్థలు, పరిశ్రమల వ్యవస్థలు కలిసికట్టుగా ముందుకుసాగాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి తెలిపారు. సైబర్ సెక్యూరిటీ పకడ్బందీగా లేకుంటే దేశాభివృద్ధి సాధ్యం కాదన్నారు.
Also Read :Dubai Princess Divorce Perfume: భర్తకు ‘డైవర్స్’.. ‘డైవర్స్ పర్ఫ్యూమ్’ రిలీజ్ చేసిన యువరాణి
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (14C)ను కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో 2018 సంవత్సరంలో స్థాపించారు. దేశంలో జరిగే సైబర్ నేరాలను పరిష్కరించేందుకు జాతీయస్థాయిలో పనిచేసే సమన్వయ కేంద్రం ఇది. సైబర్ క్రైమ్స్‌ను నిరోధించే చట్టాన్ని అమలుచేసే సంస్థల సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు 14సీ సహకారాన్ని అందిస్తుంది. కాగా, సైబర్ నేరాల వల్ల ఎంతోమంది దేశ ప్రజల జేబుకు చిల్లుపడుతోంది. చాలామంది డబ్బును కోల్పోతున్నారు. ఇటీవలే తెలంగాణలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలను టార్గెట్‌గా చేసుకొని రాజస్థాన్‌కు చెందిన ఒక ముఠా యూపీఐ స్కాంకు పాల్పడింది. ఆ కేసును సైబరాబాద్ పోలీసులు చాలా వేగంగా ఛేదించారు. భవిష్యత్తులో ఇలాంటి కేసులను ఛేదించేందుకు సైబర్ కమాండోలు కూడా సాయం చేయనున్నారు.