Ajit Pawar : అజిత్ పవార్‌కు శరద్ పవార్ షాక్.. నలుగురు అగ్రనేతలు జంప్
గతేడాది చివర్లో శరద్ పవార్‌కు షాకిచ్చిన అజిత్ పవార్‌కు(Ajit Pawar) ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
- By Pasha Published Date - 11:23 AM, Wed - 17 July 24

Ajit Pawar : గతేడాది చివర్లో శరద్ పవార్‌కు షాకిచ్చిన అజిత్ పవార్‌కు(Ajit Pawar) ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అజిత్ పవార్ వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)కి చెందిన నలుగురు అగ్రనేతలు రాజీనామా చేశారు. ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన వారిలో పింప్రి – చించ్వాడ్ పార్టీ యూనిట్ చీఫ్ అజిత్ గవానే, పింప్రీ చించ్వాడ్ స్టూడెంట్స్ వింగ్ చీఫ్ యశ్ సానే, మాజీ కార్పొరేటర్లు, రాహుల్ భోసలే, పంకజ్ భలేకర్ ఉన్నారు. వీరంతా మహారాష్ట్రలోని పింప్రీ చించ్వాడ్ ప్రాంతానికి చెందినవారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అజిత్ పవార్ పార్టీ అంతగా రాణించలేదు. ఈ కారణం వల్లే ఆ నలుగురు టాప్ లీడర్లు ఎన్సీపీకి గుడ్ బై చెప్పారని తెలుస్తోంది. వీరంతా ఈ వారంలోనే శరద్ పవార్‌కు చెందిన ఎన్సీపీలో చేరనున్నట్లు సమాచారం. ఈ పరిణామాలతో మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసకందాయంలో పడ్డాయి. ఈ ఏడాది చివర్లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇంకెన్ని పొలిటికల్ ట్విస్టులు చోటుచేసుకుంటాయో వేచిచూడాలి.
We’re now on WhatsApp. Click to Join
2023 సంవత్సరం చివర్లో శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ దాదాపు 40 మంది ఎన్సీపీ(NCP) ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేశారు. ఆ వెంటనే ఆయన బీజేపీ సారథ్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. దీంతో ఆయనకు డిప్యూటీ సీఎం పదవిని కేటాయించారు. అనంతరం మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కలిగిన అజిత్ పవార్ వర్గానిదే నిజమైన ఎన్సీపీ అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ పార్టీ పేరు, గుర్తు అజిత్‌కే దక్కుతాయని స్పష్టం చేసింది. దీంతో శరద్ పవార్ మరో పేరు, కొత్త గుర్తుతో పార్టీని మళ్లీ రిజిస్టర్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే రాజ్యసభ సీట్ల కేటాయింపులో తమకు ఎన్డీయే కూటమి తగిన ప్రయారిటీ ఇవ్వలేదని అజిత్ పవార్ నిరాశగా ఉన్నారు. ఇటీవలే కేంద్ర మంత్రి వర్గంలో సముచిత స్థానం దక్కలేదనే అభిప్రాయంతో ఆయన ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా శరద్ పవార్ వర్గం బాగా పుంజుకుంది. అజిత్ పవార్ వర్గం నుంచి పోటీ చేసిన వారు పెద్దగా గెలవలేకపోయారు. ఈనేపథ్యంలోనే అజిత్ పవార్ వర్గంలో ఉన్నవారు తమ కెరీర్ కోసం మళ్లీ శరద్ పవార్ గూటికి చేరుతున్నట్లు తెలుస్తోంది.