Teenagers Attack : చికిత్స కోసం వచ్చి.. డాక్టర్‌ను హత్య చేసి పరారైన ఇద్దరు టీనేజర్లు
డ్రెస్సింగ్ పూర్తయ్యాక.. మందుల కోసం వారు డాక్టర్ జావెద్ అఖ్తర్(Teenagers Attack) క్యాబిన్‌లోకి వెళ్లారు.
- Author : Pasha
Date : 03-10-2024 - 10:11 IST
Published By : Hashtagu Telugu Desk
Teenagers Attack : ఢిల్లీలోని నీమా హాస్పిటల్ అనే ప్రైవేటు నర్సింగ్ హోంలో ఘోరం జరిగింది. జైత్‌పూర్ ఏరియాలో ఉన్న ఈ ఆస్పత్రిలోకి డాక్టర్(55) దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి ఇద్దరు టీనేజర్లు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఈ డాక్టర్ చనిపోయారని తెలిసింది. డాక్టర్‌పై కాల్పులు జరగడానికి ముందు ఆ ఇద్దరు టీనేజర్లు ఆస్పత్రిలోకి వచ్చారు. వారిలో ఒకరు ఆస్పత్రి సిబ్బంది వద్దకు వచ్చి.. తన బొటనవేలు గాయానికి ఉన్న డ్రెస్సింగ్‌ను మార్చమని అడిగాడు. దీంతో వైద్యసిబ్బంది అతడి బొటనవేలుకు ఉన్న డ్రెస్సింగ్‌ను మార్చారు. డ్రెస్సింగ్ పూర్తయ్యాక.. మందుల కోసం వారు డాక్టర్ జావెద్ అఖ్తర్(Teenagers Attack) క్యాబిన్‌లోకి వెళ్లారు. డాక్టర్ జావెద్ అఖ్తర్ ఒక యునానీ మెడిసిన్ ప్రాక్టీషనర్.
Also Read :Israel Vs Hezbollah : హిజ్బుల్లా భీకర దాడి.. 8 మంది ఇజ్రాయెలీ సైనికుల మృతి
ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే డాక్టర్ క్యాబిన్ నుంచి తుపాకీ కాల్పుల శబ్దాలు తమకు వినిపించాయని ఆస్పత్రి సిబ్బంది గజాలా పర్వీన్, మహ్మద్ కామిల్ తెలిపారు. వెంటనే తాము ఉరుకులు పరుగులతో క్యాబిన్‌లోకి వెళ్లి చూడగా డాక్టర్ తల నుంచి తీవ్రంగా రక్తస్రావం జరుగుతోందన్నారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు గుర్తించామన్నారు. డాక్టర్‌పై దాడికి పాల్పడిన యువకుల వయసు 16 నుంచి 17 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులకు ఆస్పత్రి సిబ్బంది తెలియజేశారు. ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా కాల్పులకు పాల్పడిన టీనేజర్ల వివరాలను సేకరించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఇది టార్గెటెడ్ కిల్లింగ్ అయి ఉండొచ్చని.. అంతకుముందు నిందితులు పలుమార్లు ఈ ఆస్పత్రిలో రెక్కీ కూడా నిర్వహించి ఉండొచ్చని చెప్పారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలకు విఘాతం కలగడానికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వైఫల్యమే కారణమని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఢిల్లీని కేంద్ర ప్రభుత్వం నేరాల రాజధానిగా మార్చిందని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. గ్యాంగ్ స్టర్లు, దోపిడీ ముఠాలు ఢిల్లీలో రెచ్చిపోతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.