BJP VS AAP: గుజరాత్‌లో కేజ్రివాల్‌కు బిగ్‌షాక్..!
- By HashtagU Desk Published Date - 04:10 PM, Wed - 6 April 22
దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపధ్యంలో బీజేపీ నాలు రాష్ట్రాలను కైవశం చేసుకోగా, అనూహ్యాంగా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో విజయం సాధించింది. ప్రస్తుతం మంచి ఊపులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్ను గుజరాత్ రాష్ట్రం పై పడింది. ఈ క్రమంలో గుజరాత్ రాష్ట్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి, తాజాగా ఊహించని విధంగా భారీ ఎదురుదెబ్బ తగిలింది.
అసలు మ్యాటర్ ఏంటంటే.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 150 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరడం అక్కడ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. అలాగే మరో జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు కూడా బీజేపీలో చేరారు. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇటీవల ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రెండు రోజుల గుజరాత్ పర్యటనకు వెళ్లి వచ్చారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ గుజరాత్ పర్యటన ముగిసిన తర్వాత రెండు రోజుల్లోనే ఆప్ నుండి భారీ వలసలు చోటు చేసుకున్నాయి.
ఇక గుజరాత్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇటీవల పంజాబ్‌లో ఆప్ పార్టీ భారీ విజయం సాధించిన తర్వాత, ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన దృష్టిని గుజరాత్‌పైకి మళ్లించారు. ఈ క్రమంలో కేజ్రీవాల్ ఏప్రిల్ 2న అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆప్ చేపట్టిన తిరంగా యాత్రలో పాల్గొన్న అరవింద్ కేజ్రివాల్ మాట్లాడుతూ.. గుజరాత్‌లో 25 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ అవినీతిని అంతం చేయలేకపోయిందని రోడ్‌షోలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను నేను ఏ పార్టీని విమర్శించడానికి ఇక్కడకు రాలేదని, గుజరాత్‌లో బీజేపీని ఓడించేందుకు రాలేదని, తాను కాంగ్రెస్‌ని ఓడించడానికి రాలేదని, కేవలం గుజరాత్‌ను గెలిపించడానికి మాత్రమే వచ్చానని, గుజరాత్‌లో అవినీతిని అంతం చేయాలని కేజ్రీవాల్ అన్నారు. 25 ఏళ్ళ నుంచి గుజరాత్‌ణు పాలించిన బీజేపీ అహంకారపూరితంగా మారిందని, దీంతో ఢిల్లీ, పంజాబ్ ప్రజలు చేసినట్లే ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్ ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని, ఒకవేళ తాము నిరాశపరిస్తే ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో మార్చేయండని కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేవారు. అయితే గుజరాత్‌లో అరవింద్ కేజ్రీవాల్ పర్యటన ముగిసిన వెంటనే, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరడంతో ఆప్‌కు గుజరాత్‌లో ఊహించని విధంగా పెద్ద షాకే తగిలింది.