Punjab : కల్తీ మద్యం సేవించి 15 మంది మృతి..
సోమవారం రాత్రి 9:30 గంటల సమయంలో మజితాలోని పలు ప్రాంతాల్లో మద్యం సేవించిన వ్యక్తులు ఒక్కొక్కరిగా అస్వస్థతకు లోనవుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే స్పందించి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
- By Latha Suma Published Date - 10:35 AM, Tue - 13 May 25

Punjab : పంజాబ్ రాష్ట్రంలో మద్యం విషయంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అమృత్‌సర్ జిల్లా మజితా ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. కల్తీ మద్యం సేవించిన తర్వాత అనూహ్యంగా ఆరోగ్య సమస్యలు తలెత్తి 14 మంది మృతిచెందారు. ఇంకా ఆరుగురు తీవ్రంగా అస్వస్థతకు లోనై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Read Also: Tirumala Hills: తిరుమల కొండలపై యాంటీ డ్రోన్ వ్యవస్థ.. ఎందుకు ?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం రాత్రి 9:30 గంటల సమయంలో మజితాలోని పలు ప్రాంతాల్లో మద్యం సేవించిన వ్యక్తులు ఒక్కొక్కరిగా అస్వస్థతకు లోనవుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే స్పందించి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ప్రాథమిక దర్యాప్తులో ప్రధాన నిందితుడిగా ప్రభ్జీత్‌సింగ్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి ద్వారా లభించిన సమాచారం ఆధారంగా మరికొంతమంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
విచారణ కొనసాగుతున్న సమయంలో సహబ్ సింగ్ అనే మరొక ప్రధాన నిందితుడి పేరు బయటపడింది. అతడి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ కల్తీ మద్యం ఎక్కడ తయారైంది? ఎక్కడినుంచి సరఫరా అయ్యింది? అన్న విషయాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
ఇక, ఈ మద్యం తాగిన వారు ఇంకెవరైనా ఉన్నారా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కూడా అధికారులు ప్రత్యేకంగా బృందాలను నియమించారు. కల్తీ మద్యం తయారీదారులపై కఠిన చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఇప్పటికే రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ ఘటనపై జిల్లా అధికారులు, వైద్యశాఖ, మరియు రెవెన్యూ శాఖ సమన్వయంతో చర్యలు చేపట్టాయి. పంజాబ్ ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. కల్తీ మద్యం కేసులపై నిఘా మరింత కఠినతరం చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Read Also: Pawan Kalyan : ‘ఎస్-400’ను శేషనాగుతో పోలుస్తూ పవన్ ట్వీట్.. క్షణాల్లో వైరల్