`ముందస్తు` లేదంటూనే కేసీఆర్ సన్నద్ధం.. 2022 డిసెంబర్ లోపు తెలంగాణలో ఎన్నికలు?
టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వ్యూహాలను తెలుసుకోవడం చాలా కష్టం. ఎప్పడు ఎలాంటి ఎత్తుగడ వేస్తాడో ప్రత్యర్థులకు అంత ఈజీగా అర్థం కాదు. ఆయన చాణక్యాన్ని తెలుసుకునే ప్రత్యర్థులు తెలుసుకునే లోపుగానే లక్ష్యాన్ని చేరుకుంటాడు.
- By Hashtag U Published Date - 03:35 PM, Mon - 18 October 21

టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వ్యూహాలను తెలుసుకోవడం చాలా కష్టం. ఎప్పడు ఎలాంటి ఎత్తుగడ వేస్తాడో ప్రత్యర్థులకు అంత ఈజీగా అర్థం కాదు. ఆయన చాణక్యాన్ని తెలుసుకునే ప్రత్యర్థులు తెలుసుకునే లోపుగానే లక్ష్యాన్ని చేరుకుంటాడు. ఇప్పుడు ముందస్తు ఎన్నికల మీద ఆయన పంథా ఎంటో ఎవరికీ స్పష్టంగా తెలియడంలేదు. తెలంగాణ భవన్ లో జరిగిన శాసనసభాపక్ష, పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముందస్తు ఊసేలేదని తేల్చేశాడు. మరో రెండేళ్లలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని కుండబద్దలు కొట్టాడు. ఆ మేరకు నేతలకు డైరెక్షన్ ఇవ్వడం గమనార్హం.
కేసీఆర్ అంతరం తెలిసిన వాళ్లు మాత్రం ముందస్తు దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టు భావిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలు ఆయన వెళుతోన్న దిశను ఆధారంగా చేసుకుని ముందస్తు ఉంటుందని అనుమానిస్తున్నారు. ఎందుకంటే, 25వ తేదీ ప్లీనరీ సమావేశం పెడుతున్నాడు. ఆ తరువాత వరంగల్ ప్రజాగర్జన సభ నవంబర్ 15న పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ప్రతి గ్రామం నుంచి కనీసం ఒక బస్సు రావాలని ఆదేశించాడు. ఆ సభకు కేటీఆర్ ను ఇంచార్జిగా పెట్టాడు. లక్షలాది మంది ప్రజల తరలిరావాలని పిలుపు నిచ్చాడు. ఇదంతా ప్రభుత్వానికి అండగా ప్రజలు ఉన్నారని తెలియచేయడానికి మాత్రమేనని కేసీఆర్ చెబుతున్నాడు. కానీ, 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే తరహా సన్నాహాలు చేసిన కేసీఆర్ వైనాన్ని అవలోకనం చేసుకుంటే ముందస్తు ఎన్నికలను కొట్టేపారేయలేమని ప్రత్యర్థిలు అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని 2018 ఎన్నికలకు ముందు ప్రత్యర్థులు ప్రచారం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, కాకతీయ, నయిమ్ కేసు, డ్రగ్స్ కేసు, మియాపూర్ భూ కుంభకోణం వరుసగా అప్పట్లో బయటకు వచ్చాయి. పైగా అసెంబ్లీ నిర్మాణం ఇష్యూ కూడా పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఇలాంటి సంచలన ఇష్యూలతో ప్రజలను ఆకర్షించడానికి ప్రత్యర్థి పార్టీలు సిద్దం అయ్యాయి. అకస్మాత్తుగా ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ ఆనాడు వెళ్లాడు. అదే ఒరవడి 2019 వరకు కొనసాగితే ప్రజా వ్యతిరేకత రావడంతో పాటు సాధారణ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం ఉంటుందని కేసీఆర్ గ్రహించి 2018 ముందస్తుకు వెళ్లాడు.
ఇప్పుడు కూడా ఇంచుమించు 2018 ముందస్తుకు వెళ్లిన సమయంలో ఉన్న పరిస్థితులే రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. పైగా 2023లో సాధారణ ఎన్నికలకు కేంద్రం వెళ్లే అవకాశం ఉందని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలోని బీజేపీ ముందస్తుకు వెళుతుందని బలమైన టాక్ ఢిల్లీలో వినిపిస్తుంది. ఒక వేళ అదే జరిగితే 2023 కంటే ముందుగానే అసెంబ్లీకీ ఎన్నికలకు కేసీఆర్ వెళ్లడానికి సిద్దం అవుతాడు. సాధారణ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడానికి ఆయన సాహసం చేయడు. పైగా ప్రస్తుతం పీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు స్వీకరించిన తరువాత కాంగ్రెస్ పుంజుకుంటోంది. భూ కుంభకోణాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఇంకో వైపు షర్మిల, బీఎస్పీ నుంచి ప్రవీణ్ కుమార్ చాపకింద నీరులా ప్రజల్లోకి వెళుతున్నారు.
తెలంగాణ బీజేపీ బాగా పుంజుకుంటోంది. కేసీఆర్ అరెస్ట్ అనివార్యమంటూ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పలు మార్లు ప్రజలకు చెప్పాడు. పాదయాత్ర చేసి కేసీఆర్ పాలన మీద ఉన్న వ్యతిరేకతను ఓటు బ్యాంకు గా మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఒక విడత పాదయాత్ర ముగిసింది. దాని ప్రభావం హుజురాబాద్ ఎన్నికల ఫలితాలపై ఎంతో కొంత ఉంటుంది. ఒక వేళ బీజేపీ అక్కడ భారీ మోజార్టీతో గెలిస్తే, వెంటనే వరంగల్ సభ ద్వారా ప్రజల ఆలోచనను మళ్లించేందుకు కేసీఆర్ ప్లాన్ చేశాడు. సో…ఎన్ని కోణాల నుంచి చూసినప్పటికీ అనుకూలమైన వాతావరణం టీఆర్ఎస్ కు కనిపించడంలేదు. అందుకే, ఈసారి కూడా ముందస్తుకు అంటే..2012 డిసెంబర్ లోపు వెళతారని ప్రత్యర్థులు భావిస్తున్నారు. సమీప భవిష్యత్ లో ముందస్తు లేకపోతే కేసీఆర్ ఎలాంటి ఎత్తుగడలు వేస్తారో..చూద్దాం.
Related News

Revanth Reddy Journey: జడ్పీటీసీ నుంచి సీఎంగా రేవంత్ ప్రస్థానం
తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలన సృష్టించారు అనుముల రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని జీరో నుంచి హీరో స్థాయికి చేర్చడంలో రేవంత్ రెడ్డి కృషి చేశారు. టీడీపీ ద్వారా తన రాజకీయం మొదలుపెట్టి 130 ఏళ్ళ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం ఆషామాషీ కాదు.