Ghee: నెయ్యి ఆరోగ్యానికి మంచిదే కానీ.. వీళ్లకు మాత్రం డేంజర్!
నెయ్యి హెల్త్ కి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారికి ఇది చాలా డేంజర్ అని చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు తినకూడదు అన్న విషయాన్ని వస్తే..
- By Anshu Published Date - 03:04 PM, Mon - 30 December 24

నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. కొందరు ఆవు నెయ్యి తీసుకుంటే మరికొందరు గేదె నెయ్యి తింటూ ఉంటారు. ఈ నెయ్యిని ఎన్నో రకాల స్వీట్లు తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. నెయ్యిలో హెల్దీ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే నెయ్యిలో మన శరీరానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్స్, మంచి ఫ్యాటీ యాసిడ్స్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతిరోజూ భోజనంలో నెయ్యి భాగం చేసుకోవాలని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు. అలాగే ఆయుర్వేదంలోనూ నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణశక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
ఇది మీ హృదయ ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతున్నారు. కాగా ఖాళీ కడుపుతో నెయ్యి తింటే శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయట. జీర్ణవ్యవస్థ శుభ్రపడుతుందట, అలాగే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుందని,వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయని,హృదయం ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నెయ్యిని కొందరు తినకూడదట. కొంత మందికి పాలు, పాల ఉత్పత్తులు తింటే అలెర్జీ వస్తుంది. అలాంటి వారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తినకూడదట.
తింటే వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తింటే, అందులోని కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందట. ముఖ్యంగా నెయ్యిలో ఉండే అధిక కొవ్వు ఆమ్లాలు గుండెలోని రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ను పెంచుతాయని చెబుతున్నారు. కాబట్టి గుండె సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తినకూడదట. మీకు కాలేయ సమస్య ఉంటే, మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తినడం మానుకోవాలని లేదంటే, సమస్య తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ఖాళీ కడుపుతో నెయ్యి తీసుకోకూడదట.
మీరు భోజనంతో పాటు రోజుకు ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యిని మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. అంతకంటే ఎక్కువ తీసుకుంటే మీ బరువు పెరుగుతుందట. గర్భధారణ సమయంలో మహిళలు ఖాళీ కడుపుతో నెయ్యి తినకూడదట. ఎందుకంటే సాధారణంగా గర్భధారణ సమయంలో మలబద్ధకం, అజీర్తి, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. నెయ్యి తీసుకుంటే సమస్య మరింత పెరుగుతుందని చెబుతున్నారు. నెయ్యి జీర్ణవ్యవస్థకు మంచిదే అయినప్పటికీ, మీరు తరచుగా జీర్ణ, కడుపు సమస్యలతో బాధపడుతుంటే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో నెయ్యి తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.