Banana: ప్రతిరోజు ఉదయం అరటిపండు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఉదయాన్నే పరగడుపున అరటిపండు తినవచ్చా ఒకవేళ తింటే ఏం జరుగుతుంది? ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- Author : Anshu
Date : 03-01-2025 - 12:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఆరోగ్యానికి అరటిపండు ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. తక్కువ ధరకే ఏడాది మొత్తం లభించే పనులలో అరటి పండ్లు ముందు వరుసలో ఉంటుంది. ధర తక్కువ అయినప్పటికీ దీని వల్ల కలిగే ప్రయోజనాలను మాత్రం ఎక్కువ. కొందరు అరటి పండ్లను ప్రతి రోజు తింటూ ఉంటారు. దీనిని కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా తినవచ్చు. దీని తినడం వల్ల శరీరానికి కావాల్సిన బలం చేకూరుతుంది. అనేక పోషకాలు కూడా అందుతాయి. అరటిపండ్లను ఉదయాన్నే తినడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఉదయాన్నే అరటిపండ్లను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అరటి పండ్లలో ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఫ్రక్టోజ్, సుక్రోజ్, గ్లూకోజ్ వంటి సహజ చక్కెరలు పుష్కకలంగా ఉంటాయి. ఇవి ఒక రోజుకు అవసరమైన కొలెస్ట్రాల్, కొవ్వు లేని శక్తిని మన శరీరానికి అందిస్తాయి. దీంతో మీకు అలసట ఉండదు. బలహీనత తగ్గుతుంది. ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అయితే అరటిపండు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడుతుంది. రోజూ ఉదయాన్నే ఒక అరటిపండును తింటే శరీరంలో అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుందట. అలాగే గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వారికి దగ్గు, జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్లు తరచుగా వస్తుంటాయి. ఇలాంటి వారు ఇమ్యూనిటీ పవర్ ను పెంచే ఆహారాలను ఖచ్చితంగా తినాలి.
అయితే అరటిపండ్లు మన రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడతాయి. ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోజూ ఉదయాన్నే ఒక అరటిపండును తింటే మీ శరీరానికి రోగాలతో పోరాడే సామర్థ్యం కలుగుతుందట. చాలా మంది బరువు పెరిగిపోతామేమోనని అరటిపండ్లను తినకుండా ఉంటారు. కానీ మీరు రోజూ ఒక అరటిపండును తినడం వల్ల ఎలాంటి బరువు పెరగరు. నిజానికి అరటిపండు మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీరు రోజులో ఎక్కువగా తినలేరు. ఇది మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అరటి పండ్లు ఒక్క శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఈ పండ్లలో పుష్కలంగా విటమిన్ బి 6 ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే మానసిక స్థితిని స్థిరంగా ఉంచుతుంది. ఉదయాన్నే ఒక అరటిపండును తింటే మీరు రోజంతా రీఫ్రెష్ గా ఉంటారు. ఎనర్జిటిక్ గా పనులను కూడా చేసుకుంటారు.