కాలిఫ్లవర్ వండేటప్పుడు రుచి, పోషకాలు రెండూ కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
చాలా మంది కాలిఫ్లవర్‌ను కడిగిన వెంటనే తడి తుడవకుండా నేరుగా పాన్‌లో వేస్తారు. ఇది ఒక పెద్ద తప్పు. తడి ఉన్న కాలిఫ్లవర్ నూనెలో వేయించినప్పుడు వేగడం బదులు ఆవిరి పడుతుంది. దాంతో ముక్కలు మెత్తగా మారి సహజమైన క్రంచ్‌ను కోల్పోతాయి.
- Author : Latha Suma
Date : 21-01-2026 - 6:15 IST
Published By : Hashtagu Telugu Desk
. శుభ్రత, కట్ చేసే విధానంలో జాగ్రత్తలు
. ఉప్పు, వేడి విషయంలో చేసే పొరపాట్లు
. ముందస్తు సిద్ధం, వడ్డించే విధానం
Cauliflower : మనం రోజూ ఆహారంగా తీసుకునే కూరగాయల్లో కాలిఫ్లవర్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. గోబీగా పిలిచే ఈ కూరగాయతో కూరలు ఫ్రై, పకోడీలు, వడలు, పరాఠాలు, పచ్చళ్లు ఇలా ఎన్నో రుచికరమైన వంటకాలు తయారు చేస్తుంటాం. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేసే కాలిఫ్లవర్‌లో విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే వండే సమయంలో చేసే కొన్ని చిన్న పొరపాట్ల వల్ల దీని రుచి తగ్గడమే కాకుండా పోషక విలువలు కూడా నశిస్తాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కాలిఫ్లవర్ వంటలో తప్పులు చేయకుండా జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం.
చాలా మంది కాలిఫ్లవర్‌ను కడిగిన వెంటనే తడి తుడవకుండా నేరుగా పాన్‌లో వేస్తారు. ఇది ఒక పెద్ద తప్పు. తడి ఉన్న కాలిఫ్లవర్ నూనెలో వేయించినప్పుడు వేగడం బదులు ఆవిరి పడుతుంది. దాంతో ముక్కలు మెత్తగా మారి సహజమైన క్రంచ్‌ను కోల్పోతాయి. అంతేకాదు ఎక్కువసేపు వేయించాల్సి రావడంతో పోషకాలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి కడిగిన తర్వాత పూర్తిగా తడి ఆరిన తర్వాతే వండటం మంచిది. అలాగే కాలిఫ్లవర్ ముక్కలు సమానంగా కట్ చేయడం చాలా అవసరం. కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా ఉంటే ఉడకడంలో తేడా వస్తుంది. చిన్న ముక్కలు మెత్తబడిపోతే పెద్ద ముక్కలు గట్టిగా మిగిలిపోతాయి. ఇది మొత్తం వంట రుచిని పాడు చేస్తుంది. అందుకే ఒకే సైజ్‌లో ముక్కలుగా కట్ చేయాలి.
కాలిఫ్లవర్ త్వరగా ఉడకాలని ముందే ఉప్పు చల్లడం చాలా మంది చేసే మరో తప్పు. ముందే ఉప్పు వేయడం వల్ల కూర తేమగా మారి మెత్తగా అవుతుంది. ఫ్రై లేదా డ్రై కూరలు చేయాలనుకుంటే ఇది అస్సలు సరైన పద్ధతి కాదు. కూర పొడిగా క్రంచీగా రావాలంటే వంట మధ్యలో లేదా చివర్లో ఉప్పు చల్లడం ఉత్తమం. అదే విధంగా పాన్ పూర్తిగా వేడెక్కకముందే కాలిఫ్లవర్ వేసి వేయించడం వల్ల కూడా రుచి తగ్గుతుంది. పాన్ తగినంత వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కాలిఫ్లవర్ వేయిస్తే బయట నుంచి లేతగా వేగి లోపల సరైన టెక్స్చర్ ఉంటుంది. ఇది వంట ఆకృతిని రుచిని మరింత మెరుగుపరుస్తుంది.
వంట చేయడానికి ముందు కాలిఫ్లవర్ ముక్కలను కొద్దిసేపు వేడి నీటిలో నానబెట్టడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల దానిపై ఉండే దుమ్ము, మురికి, కీటకాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇది ఆరోగ్యపరంగా కూడా ఎంతో అవసరం. ఇక వంట చేసిన వెంటనే వడ్డించకపోవడం కూడా ఒక మంచి అలవాటు. వండిన తర్వాత కొన్ని నిమిషాలు అలాగే ఉంచితే మసాలాలు బాగా కలిసి రుచి మరింత పెరుగుతుంది. ఈ చిన్న చిట్కా కాలిఫ్లవర్ వంటను మరింత ప్రత్యేకంగా మార్చుతుంది. ఈ విధంగా చిన్న జాగ్రత్తలు పాటిస్తే కాలిఫ్లవర్‌తో చేసే ప్రతి వంట కూడా రుచిగా ఉండటమే కాకుండా అందులోని పోషకాలు కూడా నిలిచిపోతాయి. రుచి ఆరోగ్యం రెండూ కావాలంటే వంటలో పద్ధతి తప్పక పాటించాలి.