Health Tips: నోరు తెరిచి నిద్రపోతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?
నోరు తెరిచి నిద్రపోతే అనేక రకాల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 05:20 PM, Mon - 29 July 24

మామూలుగా మనలో చాలామంది పడుకునేటప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు అవి వారికి తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. అలాంటి చిన్న చిన్న తప్పులు అనారోగ్యానికి దారి తీయవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందులో నోరు తెరిచి నిద్రపోవడం కూడా ఒకటి. చాలామందికి నోరు తెరుచుకుని పడుకునే అలవాటు ఉంటుంది. మొదట పడుకునేటప్పుడు నోరు మూసుకుని పడుకున్నా కూడా బాగా మంచి నిద్రలో ఉన్నప్పుడు నోరు తెరిచి మరి గురక పెట్టడం నోరు తెరిచి నిద్రపోవడం చేస్తుంటారు.
అయితే ఇలా నోరు తెరిచి నిద్రపోవడం అస్సలు మంచిది కాదట. నోరు తెరిచి నిద్రపోయేవారు ఇతరుల కంటే గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందట. నోరు తెరిచి నిద్రపోయేవారు ఎప్పుడూ నోటిద్వారానే శ్వాస తీసుకుంటారు. దీని వల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ లభించదట. ఇది శరీరంలో రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. అలాగే ఇది గుండెపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందట. నోరు తెరిచి నిద్రపోతున్నప్పుడు నోరు ఎండిపోతుంది. అలాగే ఇది లాలాజలం ఏర్పడకుండా నిరోధిస్తుంది. దీనివల్ల నోట్లో ఎన్నో రకాల బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఇది దంత ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. నోట్లో లాలాజలం లేకపోవడం వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంది.
అలాగే దంతాల ఇన్ఫెక్షన్, కుహరం వంటి సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే ఈ నోరు తెరిచి పడుకునే అలవాటు ఆస్తమా సమస్యను మరింత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా పడుకోవడం వల్ల ఊపిరితిత్తులు మరింత శక్తితో పని చేయాల్సి వస్తుందట. ఈ అలవాటు మిమ్మల్ని ఆస్తమాకు కూడా గురిచేస్తుందని వైద్యులు చెబుతున్నారు.నోటి నుంచి వచ్చే వాసన నలుగురి ముందు ఇబ్బంది కలిగిస్తుంది. కానీ నోటి నుంచి దుర్వాసన రావడానికి ప్రధాన కారణం నోరు తెరిచి నిద్రపోవడం కూడా ఉంది. నోరు తెరిచి నిద్రపోవడం వల్ల ఎక్కువ బ్యాక్టీరియా నోటిలోకి వెళ్తుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఇకమీదటైనా నోరు తెరిచి పడుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి.