Health Tips: నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లు.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్?
కొబ్బరినీళ్లు అలాగే నిమ్మకాయ నీళ్లు ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏమి మంచివో,దేని వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 02:05 PM, Thu - 27 March 25

మనం తరచుగా కొబ్బరి నీళ్లు అలాగే నిమ్మకాయ నీళ్లు తాగుతూ ఉంటాం. మిగతా సీజన్లతో పోల్చుకుంటే సమ్మర్లో ఈ రెండు రకాల డ్రింక్స్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది తక్కువ కదా అని లెమన్ వాటర్ ఎక్కువగా తాగితే మరి అందరూ ఖర్చు అయినా పర్వాలేదు అని కొబ్బరి నీరు తాగుతూ ఉంటారు. అయితే ఇంతకీ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏవి మంచివి? దేనివల్ల ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే..
ముందుగా నిమ్మకాయ నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాల విషయానికొస్తే.. వేసవిలో నిమ్మకాయ నీళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఆరోగ్యానికి,బరువు తగ్గడానికి నిమ్మరసం చాలా ఉత్తమం అని చెబుతున్నారు. నిమ్మరసాన్ని నీళ్లలో కలిపి దీన్ని తయారు చేస్తారు. దీనిని వేడిగా లేదా చల్లగా అయినా తాగవచ్చు. నిమ్మకాయ నీటిలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఇతర ప్రయోజనకరమైన పోషకాలతో గొప్ప రుచిని కలిగి ఉంటుందట. నిమ్మకాయలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఎలక్ట్రోలైట్లు ఉన్నాయి. ఇవి కోల్పోయిన శరీర ద్రవాలను తిరిగి నింపడంలో సహాయపడతాయట.. ఈ ఎలక్ట్రోలైట్ లు శరీరం ద్రవ సమతుల్యతను కాపాడుకోవడంలో, దానిని హైడ్రేట్ గా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు.
కొబ్బరి నీళ్ల వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.. కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో
పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం , సోడియం వంటి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇది కేలరీలు తక్కువగా ఉంటుంది. అలాగే కొద్దిగా తీపి రుచిని కలిగి ఉంటుందట. కొబ్బరి నీళ్లను హైడ్రేటింగ్ డ్రింక్ గా పరిగణించడానికి ప్రధాన కారణం అందులో ఎలక్ట్రోలైట్స్ అని చెబుతున్నారు. ఇది తీవ్రమైన శారీరక శ్రమ లేదా చెమట తర్వాత శరీరాన్ని రీహైడ్రేట్ చేయడానికి సమర్థవంతమైన పానీయం అని చెప్తున్నారు. కొబ్బరి నీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరం ద్రవ సమతుల్యతను కాపాడుకోవడానికి అవసరమైన ఖనిజం. ఇది శరీరంలోని నీటి స్థాయిలను నియంత్రించడంలో,డీహైడ్రేషన్ ను నివారించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇవి రెండింటిలో ఏది మంచిది అన్న విషయానికి వస్తే.. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో నిమ్మరసం, కొబ్బరి నీరు రెండూ ప్రభావవంతంగా పనిచేస్తాయట . కొబ్బరి నీళ్లతో పోలిస్తే తక్కువ క్యాలరీలను కలిగి ఉన్నందున తక్కువ కేలరీల ఎంపిక కోసం చూస్తున్నట్లయితే లెమన్ వాటర్ మంచి ఎంపిక అని చెప్పాలి. మరోవైపు, తీవ్రమైన శారీరక శ్రమ లేదా చెమట పట్టిన తర్వాత త్వరగా ఆర్ద్రీకరణను అందించే పానీయం కోసం చూస్తున్నట్లయితే, అధిక ఎలక్ట్రోలైట్ కంటెంట్ కారణంగా కొబ్బరి నీరు మంచి ఎంపిక అని చెప్పాలి.